రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. వాతావరణం తమ పార్టీ బలం పెరుగుతున్నట్లుగా కనిపిస్తుండడంతో.. అవకాశం ఉంటే ఇతర పార్టీలనుంచి ఫిరాయింపజేసి తమలో కలిపేసుకోవడానికి.. ఏ చిన్న నేతను కూడా వడలడం లేదు. రోజు ఏదో చోట మంతనాలు చేస్తూ నేతలను తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పెరగడంతో ఇతర పార్టీల నేతలు సైతం బీజేపీ వైపు చూస్తున్నారు. తమ వంతు ఎప్పుడా అని ఎదురుచూసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు.
ఆకర్ష్ తోపాటు.. పోరాటాలకు కూడా సై ..
ప్రభుత్వ వైఫ్యాలను ఎండగట్టేందుకు ముప్పేట దాడికి సిద్ధమయ్యింది. అన్ని అంశాలపై ఒకేసారి పోరు చేసి టీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తోంది. ముందుగా రైతాంగ సమస్యలపై ఆ ఆ పార్టీ పోరు ముమ్మరం చేసింది. మండల స్థాయి నుండి జిల్లా ఆ తరువాత హైదరాబాద్ కేంద్రంగా పోరాటాలు చేసేందుకు కార్యచరణ ప్రకటించింది. రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని.. సన్నాలను కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని.. కేంద్రం చేస్తున్న పథకాలను అమలుచేయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుందన్న అంశాలతో పోరుబాట పట్టింది.
ఉద్యోగులకు అండగా..
తెలంగాణలో ఉద్యోగులను కేసీఆర్ సర్కార్ తీవ్రంగా వేధిస్తోందని.. వారికి ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏ ఇవ్వకుండా నాన్చుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంటే కనీసం గౌరవం లేకుండా పోయిందని.. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌పై ఉద్యోగులను ఏకం చేసే పనిలో పడింది బీజేపీ. మరోవైపు గో రక్ష పేరుతో మరో పోరుకు సిద్దమైంది బీజేపీ. పశువధను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిలిపి వేయడం అనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. కర్ణాటక తరహాలో కొత్త చట్టం తీసుకు రావాలని.. పశువులను వధించే వారిని కఠినంగా శిక్షించాలని.. అవసరమైతే అందుకోసం గోరక్ష టీం లను కూడా రంగంలోకి దింపుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఒకే సారి మూడు రకాల పోరుబాటలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే కచ్చితంగా బీజేపీకి ప్రజల్లో మంచి పేరు రావడమే కాకుండా ఏక పక్షంగా సాగుతున్న టీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉందని భావిస్తోంది బీజేపీ. మరి బీజేపీ యాక్షన్ ప్లాన్ కు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.. ఆ పార్టీ పోరాటాలతో టీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచిచూడాలి.
Must Read ;- కేంద్రంపై కాలుదువ్వుతున్న టీఆర్ఎస్!











