‘మా’ ఎన్నికలు అనగానే అదే పెద్ద సినిమాగా అందరికీ కనిపిస్తుంది. అంత ‘కమ్మ’దనం ఈ ఎన్నికల్లో ఏముందో తెలియదు. దీని చుట్టూ ‘కాపు’కాసేవారూ తక్కువగా లేరు. అందుకే ‘మా’ ఎన్నికలకు మించిన వినోదం మరేదీ జనానికి కనిపించదు.
దేశానికీ, రాష్ట్రానికీ లేని ఎన్నికల సందడి ‘మా’లోనే కనిపిస్తుంది. ఎప్పుడో సెప్టెంబరులో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సందడి ఇప్పుడే మొదలైందీ అంటే ఆశ్చర్యంగా లేదూ! ‘మా’ ఎన్నికలు అనే కోయిల తొందర పడి ముందే ఎందుకు కూయాల్సి వచ్చిందో ఎవరికీ అర్థంకాదు. ఇందులో ఉన్న సభ్యుల సంఖ్య 962. వీరిలో కీలకంగా ఉండేవారు మహా అయితే 500 మంది మాత్రమే ఉంటారు. 250 ఓట్లు ఎవరు తెచ్చుకోగలిగితే చాలు విజయలక్ష్మి వరించేస్తుంది.
కళాకారుల్లో ‘కులా’కారులూ ఉన్నారు. కళ అనేది కళ కోసం, ప్రజల కోసమే. ప్రజాస్వామ్యానికి నాలుగు పిల్లర్లు ఎలా అవసరమో, సినిమాని నిలబెట్టాలన్నా అలాంటి మూలస్తంభాలు అవసరమే. అవి కులాలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కులాలను కళకు ఆపాదించడం వల్లే సమస్యలు వస్తున్నాయి. మా ఎన్నికలు వస్తున్నాయంటే సామాజిక సమీకరణాల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. సినిమా అనే తెరపైన ఈ కుల ఛాయలు ఏమాత్రమూ కనపించవుగానీ తెరవెనక మాత్రం కీలకపాత్ర కులానిదేనన్న వాదన ఏనాటి నుంచో ఉంది.
తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే..
తెలుగులో తొలి సినిమా 1931లోనే తీశారు. తొలితరంలో బ్రాహ్మణుల ఆధిపత్యం సినిమా రంగంలో ఉండేదన్న విమర్శ ఉండేది. ఏయన్నార్, ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గం కావడంతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన దర్శకులు కూడా ఎక్కువగా ఉండటంతో వారిదే ఆధిపత్యం అనే వాదన ఉంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అగ్ర హీరోగా ఎదిగడం, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడ పెద్దన్న పాత్రను పోషించడం వల్ల కాపుల అధీనంలోకి తెలుగు సినిమా వెళ్లిపోయిందనే వాదన ఉంది.
‘మా’ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులాల ప్రస్తావనలు వస్తుంటాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా కుల సమీకరణాల ప్రస్తావన వచ్చింది. దాటవేత ధోరణిలోనే ఆయన సమాధానం వచ్చింది. అసలు ప్రకాష్ రాజ్ ది ఏ కులం అనేది కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఆయన కులం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసినా ఎవరికీ తెలియక పోవచ్చు కూడా.
Must Read ;- ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హే..‘మా’ అండ్ కో?
కమ్మ డామినేషన్ ఉందా?
సినిమా అంటే విపరీతమైన కమ్మ డామినేషన్ అంటూ విపరీమైన ప్రచారం బయట జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏయన్నార్ ఉన్నా వారు జీవితాంతం నటనకే అంకితమయ్యారు. అరవై సంవత్సరాల దాకా ఎన్టీఆర్ కి బయటకి వచ్చి రాజకీయం చేసే పరిస్థితి లేదు. తెరవెనక ఎలాంటి రాజకీయం జరిగిందో మనకు తెలిసే అవకాశం కూడా లేదు. ‘మా’ ఎన్నికల విషయంలో కూడా అటు ఎన్టీఆర్ ఫ్యామిలీగానీ, అక్కినేని ఫ్యామిలీగానీ, రామానాయుడు ఫ్యామిలీగానీ జోక్యం చేసుకున్న సందర్భాలు దాదాపుగా లేవు. ఎవరి షూటింగులు వారు చేసుకుంటారు,
ఇలాంటి ఎన్నికలు వస్తే వచ్చి ఓటేసి వెళతారు తప్ప తెరపైకి వచ్చిన సందర్భాలు లేవు. మా అసోసియేషన్ ఏర్పడి 26 సంవత్సరాలు అయ్యింది. దీని వ్యవస్థాపక అధ్యక్షులుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. మురళీ మోహన్, మోహన్ బాబు, నాగార్జున లాంటి వాళ్లంతా మా అధ్యక్ష పదవుల్ని నిర్వహించిన వారే. మోహన్ బాబు చాలా కాలం మా ప్రెసిడెంట్ పనిచేశారని చెప్పవచ్చు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణం రాజుకు అలాంటి అవకాశం రాలేదు. అదే సామాజిక వర్గానికి చెందిన శివాజీ రాజా ఒక్కడికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. హీరోలైన నిర్మాతలే మా అసోసియేషన్ ను ఏలారన్న అపనింద కూడా ఉంది. ఈ విషయంలో అసలైన ఆర్టిస్టులకు న్యాయం జరగలేదనే వాదన కూడా ఒకటి ఉంది.
మహానటుడు ఎన్టీఆర్ వారసులు ఎవరూ మా అసోసియేషన్ కు వ్యవహారాల్లో తలదూర్చలేదు. నందమూరి బాలకృష్ణ మొదట్నుంచీ ఇలాంటి వ్యవహారాలకూ దూరంగానే ఉంటారు. ‘మా’ పదవుల కోసం ఆయన అర్రులు చాచటం లేదు. నాగార్జున కూడా ఓటేసి వెళతారు తప్ప ప్రస్తుతం తెరవెనక పాత్ర పోషిస్తున్న దాఖలాలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మా రాజకీయాలకు దూరంగానే ఉంటారు. తెలుగు దేశానికి సన్నిహితంగా ఉండే సినిమా నటులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం లేదు.
ఇప్పుడు మోహన్ బాబు కుమారుడు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మరి విష్ణును కమ్మ సామాజిక వర్గంలో వేయాలా? ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహిత బంధువు కావడం వల్ల రెడ్డి సామాజిక వర్గం అనుకోవాలా అన్న మీమాంస కూడా ఉంది. ఈ ఎన్నికల్లో రాజకీయ శక్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయా? కుల శక్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయా అన్న సందేహాలు కూడా ఉన్నాయనుకోండి. వైఎస్ఆర్ సీపీ బంధువైన మోహన్ బాబుకూ, కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికీ మధ్య మాత్రమే మా రాజకీయం నడుస్తోందన్న వాదన కూడా ఉంది.
మాలో కొంత కాలంగా చిరంజీవి మాటే చెల్లుబాటు అవుతోంది. ఆయన మద్దతు ఉన్న వ్యక్తులదే పైచేయిగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇలాంటి రాజకీయమే నడిచింది. మెగాస్టార్ ఎవరిని నిలబెడితే వారికే ఓటేస్తున్నారు. నటి జీవిత సామాజిక వర్గం కాపు కిందికే వస్తుంది. జీవిత బరిలోనే ఉంటారా? మోహన్ బాబు ప్యానల్ వైపు మళ్లుతారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. నాలుగో అభ్యర్థిగా బరిలో ఉన్న హేమ కూడా కాపు సామాజిక వర్గం కిందికే వస్తారు. కాబట్టి ‘మా’ను కాపు కాస్తున్నది మాత్రం ఒక వర్గమే అనుకోవాల్సి వస్తోంది. ఆ వర్గం మాటే చెల్లుబాటు అవుతోంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- కోపంతో కాదు ఆవేదనతో పుట్టిన ప్యానల్ మాది: ప్రకాష్ రాజ్