నివర్ తుఫాను రైతులను తీవ్ర నష్టం కలుగజేసింది. 7 జిల్లాల్లో 40 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నివర్ తుఫానుకు ఒరిగిపోయిన వరిపంటను కొందరు రైతులు ఇప్పటికే నూర్పిడి చేశారు. మరికొందరు పంటను కోయకుండానే దున్నివేశారు. అయితే తీరిగ్గా నివర్ పంట నష్టం అంచనాలు వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాల్లో, భారీ వర్షాలు ముంచెత్తిన వరద ఆనవాళ్లు ఎక్కుడా కనిపించడం లేదు. అయితే కేంద్ర బృందం మాత్రం తమ పని కానించేస్తున్నారు. నివర్ నష్టంపై కేంద్రం సాయం చేయాలనుకుంటే ఎంతో కొంత ప్రకటించి ఉండాల్సింది. కేంద్రం మొదట మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. తరవాత బీజేపీ నేతలు కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖలు రాయడంతో, కేంద్ర బృందం ఎట్టకేలకు తరలివచ్చింది. అయితే సాయం ప్రకటిస్తారా? లేదా? అనేది కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. కేంద్ర బృందం పర్యటించినంత మాత్రాన, కేంద్రం సాయం చేస్తుందనుకుంటే అది ఒట్టి భ్రమే అవుతుంది.
నివర్ నష్టం రూ.12 వేల కోట్లు
ఏపీలో ఖరీఫ్ వరిపంట చేతికి వచ్చే సమయంలో విరుచుకుపడిన నివర్ తుపానుతో 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 35 బస్తాల దిగుబడి రావాల్సిన ధాన్యం దిగుబడులు 20 బస్తాలకు పడిపోయింది. ఇక వరి పంట తుఫాను గాలులు, భారీ వర్షాలకు నీట మునిగింది. దీంతో ధాన్యం తడసిపోయి రంగు మారింది. ధాన్యం రంగుమారడంతో క్వింటా రూ.1100 మించి కొనడం లేదు. దీనికితోడు వరి నూర్పిడికి అయ్యే ఖర్చులు రూ.3 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయి. ఇలా ఎకరాకు వరి రైతుకు కనీసం రూ.25 వేల నష్టం వాటిల్లింది. నష్టం మొత్తం ప్రభుత్వాలు భరించలేకపోయినా, కనీసం ఎకరాకు రూ.పదివేలు సాయం చేయాలని రైతులు వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. తీరిగ్గా కేంద్ర బృందం పర్యటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Must Read ;- నివర్ నష్టం అనంతం.. పంటల బీమా పచ్చిమోసం
పంటల బీమా అటకెక్కినట్టే
ఏపీలో ప్రభుత్వం పంటల బీమా మొత్తం మేమే చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో రైతులు తమ వాటా పంటల బీమాను చెల్లించడం నిలిపివేశారు. హామీ ప్రకారం ఏపీ ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. కానీ అలా చేయలేదు. దీంతో నివర్ తుఫానుకు భారీగా పంటనష్టం వాటిల్లినా బీమా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఏపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంటల బీమా కింద రూ.1200 కోట్లు ఇటీవల చెల్లించింది. ఇక నివర్ తుఫాను బీమా ప్రీమియంగా చెల్లించాల్సిన రూ.900 కోట్లు త్వరలో రైతుల ఖాతాలో త్వరలో వేస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫాను పంటల బీమా పరిహారంగా రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వచ్చి ఉండేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఎప్పుడూ ఇంతే
వరదలు, తుఫానులు వచ్చి పోయిన రెండు నెలల తరవాత కేంద్ర బృందాలు పర్యటించడం దేశంలో ఆనవాయితీగా మారింది. వరదలు, తుఫానులు రాగానే పరిశీలనకు వస్తే నీటిలో కొట్టుకుపోతారని వారు భయపడుతున్నారేమోననే అనుమానం కూడా కలుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపోయాక రెండు నెలలకు కేంద్రం నుంచి అధికారులు వస్తే వారు ఏమి చూస్తారు, నష్టం అంచనాలు ఎలా వేస్తారు. ఇవన్నీ చూసేవారికి పెద్ద కామెడీగా అనిపిస్తున్నాయి. కేంద్రం సాయం చేయాలనుకుంటే ఎంతో కొంత మొత్తం వెంటనే విడుదల చేస్తే ప్రయోజనం దక్కుతుంది. అంతే కాని నష్టం జరిగిన రెండు నెలలకు పరిశీలన, మరో ఆరు నెలలకు పరిహారం అన్న చందంగా వ్యవహారం తయారైంది.
Also Read ;- ‘రైతుకి అండగా నిలబడలేని ప్రభుత్వం ఉండీ ఏం లాభం?’











