మీరిక ఒంటరి కాదంటూ మాట కలుపుతారు.. మీకు తోడు నేనున్నానంటూ మాయ చేస్తారు.. హద్దులు దాటిన అసభ్యపదజాలంతో వల వేస్తారు.. నగ్నమైన చిత్రాలతో, వీడియోలతో కవ్విస్తారు.. మిమ్మల్ని అలాగే చూడాలి అంటూ అలక నటిస్తారు. ఒకవేళ వారి మాటలను, ప్రవర్తనను పొరపాటున నమ్మినా.. మీ పనైపోయినట్టే. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. యువత బలహీనతలను అదనుగా తీసుకుని కొన్ని సంస్థలు రెచ్చిపోతున్నాయి.
ఆశపడితే అంతే సంగతులు
మీరు ఒంటరిగా ఉంటే మాతో చాట్ చేయచ్చు అంటూ సోషల్ మీడియా, మెసెజ్ ద్వారా మీకు లింక్ పంపుతారు. అది నమ్మి క్లిక్ చేస్తే, అందమైన అమ్మాయిల ఫొటోలను, మాటలను, వీడియోలతో మిమ్మల్ని అలరించడం మొదలుపెడతారు. ఆ చర్యలను నమ్మి ఆశపడ్డారా ఇక మీ సంగతి అయిపోయినట్టే. మీరు పూర్తిగా ఎప్పుడు నమ్ముతారా అని ఎదురుచూస్తున్న వారు, మీకు సంబంధించిన పర్సనల్ వీడియోలను, ఫొటోలను పంపమని అడుగుతారు. అంతేకాదు, నగ్నంగా వీడియో కాల్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్ చేస్తారు. ఇక ఆపై వారి అసలైన నిజస్వరూపం చూపిస్తారు.
మెల్లగా మిమ్మల్ని బెదిరించి చిన్న మొత్తాలు మొదలుకుని పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తారు. మీరు పోలీసులను ఆశ్రయించినా.. ఫోన్ నంబర్ మార్చడం లాంటివి చేసినా.. మీ వీడియోలు, ఫొటోలు సామాజిక మాద్యమం లేదా బంధువులకు పంపుతాం అంటూ మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తారు. వారి అంతిమ లక్ష్యం డబ్బు, అది మీరు ఇస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. మీరు ఏమాత్రం ఎదురు తిరిగినా, మీపై అనుమానం వచ్చినా మీ ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేసి పరువు తీస్తున్నారు.
Must Read ;- 60వేల కోట్ల యవ్వారం.. మొద్దునిద్ర దుష్ఫలితం!

దారితీస్తున్న పరిస్థితులు ఏంటి?
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఉపయోగించడం ఎక్కువైంది. ముఖ్యంగా యువత వాటికి ఆకర్షితులవుతున్నారు. రోజులో ఎక్కువ సమయం చాటింగ్, ఫ్రెండ్స్ అంటూ గడిపేస్తున్నారు. తల్లదండ్రులు కూడా బిజీ జీవితాల వల్ల వారిని గమనించడం లేదు. ముఖ్యంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ముఖ్య కారణంగా కనిపిస్తుంది. బిజీ జీవితాల వల్ల పిల్లలకు దిశా నిర్ధేశం చేయాల్సిన తల్లిదండ్రలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీటితో పాటు నేటి తరంలో పిల్లలు ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వారేం చూస్తున్నారు, ఎటువంటి లింక్స్ ఓపెన్ చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. వారి దారి తప్పుతున్నారనే విషయం తెలుసుకుంటే వారిని ఎలా మార్చుకోవాలో మనకు అర్ధమవుతుంది. పిల్లలు అసలేం చేస్తున్నారో కూడా తెలియకపోలే మనమేం చేయగలం?
ఇటువంటివి కొత్తేం కాదు..
ఇలాంటి సైబర్ క్రైమ్ కేసులు కొత్తేం కాదు. ఇప్పటికే ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు, యువతకు అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో చెప్తున్నారు. అయినా కానీ, యువత అగంతకుల మాయలో పడి చివరికి పరువు పోగొట్టుకుంటున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.
పట్టుకోవడం కష్టంగా మారింది
మోసాగాళ్లు టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఇలాంటి కేసులన చేధించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. బాధితులకు ఫోన్ మాట్లాడి నమ్మకం కలిగించాక వాట్సప్ లాంటి మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ కాల్స్ చేస్తున్నారు. సిమ్‌ని అందుబాటులో లేకుండా తొలగించడం వల్ల నేరగాళ్లను పట్టుకోవడం ఛాలెంజ్‌గా మారింది. దీనికి కేవలం అప్రమత్తంగా ఉండడమే పరిష్కారం. ఇటువంటి వాటిని తల్లిదండ్రులకు లేదా పోలీసులను ఆశ్రయించి పరిష్కరించుకోవడం మంచిది. తెలియని వారికి మనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంపడం, అశ్లీలంగా వీడియో కాల్స్ మాట్లాడడం లాంటివి మానుకోవాలి. అప్పుడే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టగలం.
సామాజిక విరుద్దమైన పనులు ఎప్పటికైనా అనర్ధాలకు దారి తీస్తాయి. ముక్కు మోహం కూడా తెలియని వ్యక్తిని అంతగా నమ్మితే వాటికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.
Also Read ;- ఎఫ్బీ బాటలో.. ఎస్పీ పేరుతో వసూళ్ల దందా!











