ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం సమసిపోలేదు. మత్స్యకారులను ప్రభుత్వం చర్చలకు పిలిచినా రాలేదు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని వాడరేవు మత్స్యకారులు తేల్చి చెప్పారు. దీంతో సమస్య జఠిలంగా మారింది. దీనికితోడు చీరాల వైసీపీ నేత ఆమంచి వర్గం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గాలుగా మత్స్యకారులు విడిపోవడంతో సమస్య మరింత ముదిరింది. అసలు రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది ఎవరు? కేవలం వలల విషయంలోనే రెండు గ్రామాల మత్స్యకారులు గొడవలకు దిగుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వాడరేవు మత్స్యకారుల వాదనేంటి?
వాడరేవు మత్స్యకారులను సముద్ర దొంగలుగా ముద్ర వేస్తున్నారని పల్లెకారులు వాపోతున్నారు. కటారివారిపాలెం మత్స్యకారులు వాడే ఐల వల కన్ను కేవలం 8 మి.మీ. మాత్రమే ఉంటుందని, చేప పిల్లలు కూడా వలలో చిక్కుకుని చనిపోతున్నాయని వాడరేవు మత్స్యకారులు చెబుతున్నారు. అసలు సమస్య కటారివారిపాలెం మత్స్యకారులు వాడుతున్న ఐల వల వల్లేనని వారి వాదనగా ఉంది. ఐల వలను సముద్రంలో రెండు కిలోమీటర్ల దూరం వేసి రెండు వైపులా వంద మంది మత్స్యకారులు చొప్పున ఉండి ఓడ్డుకు లాగుతున్నారని దీని వల్ల సముద్రంలో ఉండే చిన్న చేపలు కూడా ఒడ్డుకుపడి చనిపోతున్నాయని వాడరేవు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల మత్స్య సంతానోత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోందని, ఏటికేడాది సముద్రంలో చేపలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడరేవు మత్స్యకారులపై పెట్టిన పోలీసు కేసులు ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని వారు తెగేసి చెబుతున్నారు. అప్పటి వరకు ఎలాంటి చర్చలకు తావులేదని వాడరేవు మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు.
కటారివారిపాలెం మత్స్యకారుల వాదన ఇలా..
తాము వాడే ఐల వల 40 సంవత్సరాల నుంచి ఉంది. దీని వల్ల నష్టం లేదని కటారివారిపాలెం మత్స్యకారులు చెబుతున్నారు. బల్ల వల కన్ను చాలా చిన్నగా ఉంటుందని దాని వల్ల బురదలో ఉండే చేప పిలల్లు కూడా వలకు చిక్కి చనిపోతున్నాయని కటారివారిపాలెం మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. వాడరేవు మత్స్యకారులు వినియోగిస్తున్న బల్లవల కేవలం ఐదు సంవత్సరాల కిందటే వచ్చిందని, దాని వల్లే మత్స్య సంపద తగ్గిపోయిందని కటారివారిపాలెం మత్స్యకారులు వివరిస్తున్నారు. రెండు గ్రామాల మత్స్యకారులు తప్పు మీదంటే మీదని ఆరోపించుకుంటున్నారు. రెండు వలలను నిషేధించిన ప్రభుత్వం, ఆ వలను స్వాధీనం చేసుకుని, మత్స్య సంతానోత్పత్తికి నష్టం లేని వలను మత్స్యకారులకు పంపిణీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- ప్రకాశం వైసీపీలో అసంతృప్తి గళాల అసలు కథేంటి…?
రెండు వలలను నిషేధించిన ప్రభుత్వం
ఐల వల, బల్ల వల రెండింటినీ ప్రభుత్వం నిషేధించింది. చిన్న కన్ను ఉండే వలలు కావడంతో చేప పిల్లలు వలకు చిక్కి చనిపోతున్నాయని గతంలోనే ప్రభుత్వం ఈ వలలను నిషేధించింది. అయితే, వలలను తనిఖీ చేసి పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మత్స్యకారులు ఎలాంటి వల వాడుతున్నారో తనిఖీలు చేయాలి. ఒక వేళ నిషేధించిన వలలు వాడితే వారిపై కేసులు కూడా నమోదు చేయవచ్చు. ప్రభుత్వం ఈ రెండు వలలపై నిషేధం అయితే విధించింది కానీ పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేసింది. దీని వల్లే సమస్య తలెత్తుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ కోణం
వారం రోజుల కిందట సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారులు గొడవ పడ్డారు. సముద్రంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. చేపల వేటకు వినియోగించే మరపడవలతో ఛేజింగ్ చేసుకున్నారు. ముందుగా వాడరేవు మత్స్యకారులు కటారివారిపాలెం వారిపై దాడికి దిగారు. సముద్రంలో దాడికి దిగడంతో వారు తమ బంధువులకు ఫోన్ చేసి తమను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కటారివారిపాలెం మత్స్యకారులు వాడరేవు గ్రామంపై దాడికి దిగారు. ఆ తరవాత వాడరేవులో నివసిస్తున్న కటారివారిపాలేనికి చెందిన 50 కుటుంబాల వారిపై వాడరేవు మత్స్యకారులు దాడులు చేశారు. వారంతా భయంతో ఇళ్లు వదలి పారిపోయారు. ఈ ఘర్షణలతో వాడరేవు మత్స్యకారులపై పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులు ఓ వర్గంగా, కరణం బలరాం వర్గం ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. దీంతో రెండు గ్రామాల మధ్య సయోధ్య కుదరడం లేదని తెలుస్తోంది. ఓ వర్గాన్ని ఆమంచి కృష్ణమోహన్ ప్రోత్సహిస్తున్నారని రెండు రోజుల కిందట అతనిపై మత్స్యకారులు తిరగబడ్డారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పరుగులు లంకించుకుని పారిపోయారు. అప్పటి నుంచి వాడరేవు మత్సకారులను ఆమంచి కృష్ణమోహన్ కటారివారిపాలెం మత్స్యకారులపై రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసులు ఎత్తివేసే వరకు చర్చలకు వచ్చేది లేదని వాడరేవు మత్స్యకారులు ప్రకటించడం వెనుక ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారనే అనుమానాలను కటారివారిపాలెం గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య రగడను పరిష్కరించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Also Read ;- నోటికి తాళం : పార్టీ మారితే అంత కష్టమా?











