మహానటుడు ఎన్టీఆర్ తోనే జానపద, చారిత్రక చిత్రాల చరిత్ర అంతరించిపోయిందని అనుకుంటున్న తరుణంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయులుగా నటించి అందర్నీ మెప్పంచి ఆ తరహా పాత్రల పోషణలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ మోడ్రన్ డేస్ లో ఇంకా జానపద చిత్రాలు జనం చూస్తారా అని ఇండస్ట్రీ అనుకుంటున్న సమయంలో బాలకృష్ణ భైరవద్వీపం సినిమా చేసి జానపద వీరుడుగా చరిత్ర సృష్టించారు. ఆతర్వాత కొంత కాలానికి భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి ఓ అద్భుతమైన జానపద చిత్రాన్ని బాలకృష్ణతో తీయబోతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఎంతో సంబరపడ్డారు.
బాలకృష్ణకు, భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఎంతో అనుబంధం ఉంది. నేను బాలయ్య అభిమానినే అని నిర్మాత గోపాల్ రెడ్డి శతదినోత్సవ వేదిక పై ప్రకటించిన దగ్గర నుంచి ఆయన్ని తమ అభిమాన నిర్మాతగా ట్రీట్ చేయడం ప్రారంభించారు బాలయ్య అభిమానులు. బాలకృష్ణ – కోడి రామకృష్ణ – గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మంగమ్మ గారి మనవడు, ముద్దు కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య ఇలా.. అన్ని చిత్రాలు హిట్లే. ఈ కాంబినేషన్ లోనే 2001 జనవరి 9న ఓ భారీ జానపద చిత్రానికి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ లోని తెలుగు లలిత కళావేదికలో అభిమానుల సమక్షంలో భారీగా ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలకృష్ణ విక్రమసింహ భూపతిగా, యుద్ధవీరుడుగా రెండు పాత్రలు పోషిస్తారని ప్రకటించారు. సినిమాకు విక్రమసింహ భూపతి అని టైటిల్ కూడా అనుకున్నారు. రోజా, అంజలా ఝవేరి, పూజా బాత్రా హీరోయిన్స్. నాజర్, శరత్ బాబు, విజయ్ చందర్, ఎల్బి శ్రీరామ్, కెఆర్ విజయ ఇతర ముఖ్య తారాగణం. రామోజీ ఫిలింసిటీలో సెట్స్ వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో రెండు వార్ ఎపిసోడ్స్ ఉండడంతో ఒకటి రాజస్థాన్ లో, రెండోది అరకు లోయలో తీయడానికి ప్లాన్ చేశారు. ఇందులో అరకులో చిత్రీకరించే వార్ ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్ కావడంతో ఇండియన్ స్క్రీన్ మీద అంత వరకు ఎవరూ తీయని రీతిలో అత్యంత భారీగా తీయడానికి గోపాల్ రెడ్డి ప్లాన్ చేశారు.
అలాగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, ఒక పాట కొంత యాక్షన్ పార్ట్, చిత్రీకరించడం కోసం వైజాగ్ లో కొండల మధ్య సెట్ వేశారు. ఈ సెట్ లో షూటింగ్ జరగలేదు. రామోజీ ఫిలింసిటీలోని అతి పెద్ద ఫ్లార్ ను అద్దెకు తీసుకుని పెద్ద సెట్ వేశారు. ఆ సెట్ లో ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. కారణం ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడమే. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. బాలయ్యకు గోపాల్ రెడ్డికి పడలేదని.. కోడి రామకృష్ణను పక్కకు తప్పిస్తేనే తను వర్క్ చేస్తానని బాలయ్య మొండిపట్టు పట్టారని చెబుతారు. నిజం దేవుడికే తెలియాలి. ఏది ఏమైనా పంతాలు.. పట్టింపులకు గోపాల్ రెడ్డి బలయ్యారు. సినిమా పూర్తి చేయలేకపోయాననే మనోవ్యధ ఆయన్ని చాలా కాలం వెంటాడింది. మొత్తానికి ఈ విధంగా.. బాలయ్య జానపద చిత్రం విక్రమసింహ భూపతి ఆగిపోయింది.
Must Read ;- బాలయ్య ‘నర్తనశాల’ తెర వెనక ఏం జరిగిందో తెలుసా?