నిన్నటితరం కథానాయికగా రమ్యకృష్ణ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేశారు. ఇక ఇప్పుడు కూడా ఆమెలో గ్లామర్ అంతగా తగ్గలేదు .. పైగా నటనలో మరిన్ని మెట్లు ఎక్కేశారు. ఒకప్పుడు తెరపై గ్లామర్ మెరుపులు పూయించిన రమ్యకృష్ణ, ఇప్పుడు కళ్లతోనే నవరసాలను నడిపిస్తున్నారు. దర్జా .. దర్పం .. రాజసంతో కూడిన పవర్ ఫుల్ పాత్రలకి ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రస్తుతం ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా ఉంది. అంతలా ఆమె తన అసమానమైన అభినయంతో అలుముకున్నారు.
ఈ ఏడాది రమ్యకృష్ణ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. పూరి జగన్నాథ్ ‘లైగర్‘ సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆకాశ్ పూరి హీరోగా చేసిన ‘రొమాంటిక్‘ మూవీలోను ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రిపబ్లిక్’ సినిమాలోను ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. రీసెంట్ గా ఆమెకి సంబంధించిన పోర్షన్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా ఆమెకి దేవ కట్టా కృతజ్ఞతలు తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవ కట్టా ‘రిపబ్లిక్‘ సినిమాను రూపొందిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన నాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ ఉండటంతో, ఆ పాత్రను రమ్యకృష్ణ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో దేవ కట్టా ఆమెను ఒప్పించాడట. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా చేసిందని అంటున్నారు. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నారు.
Must Read ;- ఏసుక్రీస్తుగా జగపతిబాబు సోషల్ మీడియాలో వైరల్