టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లపై వచ్చిన టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై దేశం మొత్తం మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి రోజున సుమారు రూ. 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జోస్యం చెప్పారు.
అంతేకాకుండా మొదటి వారంలో 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘బాహుబలి’ చిత్రం ద్వారా ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తదుపరి సినిమా కోసం భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూస్తుందని ఆయన అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తమ్మారెడ్డి వ్యాఖ్యలతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తో సినిమా మొదలవుతుందని, అలాగే హిందీలో ఆమిర్ ఖాన్ వాయిస్ తో సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది మే నెలలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి. అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నాడని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరి తమ్మారెడ్డి భరద్వాజ జోస్యం ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి.
Must Read ;- మెగా గళంతో ముందుకుసాగుతున్న ఆర్ఆర్ఆర్ దళం











