(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి )
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎంఆర్‌డిఏ) పరిధిలో కొత్తగా 13 మండలాలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే రేగుతోంది. రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయం ఒక ముఖ్యమంత్రి తీసుకుంటారా? అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్టు జగన్‌కు పరిపాలనపై అవగాహన లేమి ఉందని మరోసారి రుజువైంది. విశాఖ జిల్లాలోని 13 మండలాలను విఎంఆర్డిఏ పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ 20 జారీ చేసింది. 13 మండలాల్లోని నాన్ షెడ్యూల్డ్ మండలాల పరిధిలోని 431 గ్రామాలకు చెందిన 2.280 చదరపు కిలోమీటర్ల భూములను విఎంఆర్డిఏ కిందకు చేర్చారు.
విశాఖ మెట్రో రీజియన్లోకి వచ్చిన 13 మండలాలు..
నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రవికమతం, బుచ్చయ్య పేట, నాతవరం, సబ్బవరం , దేవరాపల్లి, కె కోటపాడు, మాకవరపాలెం, గోలిగుండ, రోలుగుంట, చీడికాడ మండలాలు కొత్తగా చేరాయి. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మండలాలు మినహా మిగిలినవన్నీ విఎంఆర్‌డిఏ పరిధిలోకి ప్రభుత్వం చేర్చింది.
5వ షెడ్యూల్ పరిధిలోకి..
నాతవరం మండల పరిధిలోని సరుగుడు, చిమ్మ చింత, కురువాడ, పొట్టి నాగన్న దొరపాలెం, శరభవరం, కృష్ణాపురం అగ్రహారం, బురదపల్లి అగ్రహారం, ధర్మవరం అగ్రహారం వంటి గ్రామాలు అయిదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి. ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే గిరిజన గ్రామాల్లో 1/70 చట్టం అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చట్టానికి లోబడి అమలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతాల షెడ్యూల్ ఏరియా స్థితి మార్చాలంటే రాష్ట్రపతి ఆదేశాలతో మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా విస్మరించిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గిరిజన భూములను వియమ్‌ఆర్‌డిఏ పరిధిలోకి తీసుకురావడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పరోక్షంగా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు, అందుకు కార్పొరేట్ శక్తులను తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నట్టు సిపిఎం ఆరోపణ చేసింది. షెడ్యూల్ గ్రామాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పీసా చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించి, ప్రజల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అటువంటి అభిప్రాయసేకరణ లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం మండలాలను విలీనం చేయడంపై కనీస అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయంగా కమ్యూనిస్టులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవోను సవరించి, షెడ్యూల్డ్ గ్రామాలను విఎంఆర్డీఏ పరిధి నుంచి తొలగిస్తూ కొత్తగా మరో జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
గ్రామ సభ ఆమోదమే అంతిమ నిర్ణయం..
అటవీ హక్కుల చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణకు కఠిన సెక్షన్లు అమలులో ఉంటాయి. ఇప్పటికే 804 షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని 1980లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 5వ షెడ్యూల్ పరిధిలోని గ్రామాలను గ్రామసభ ఆమోదం లేకుండా ఎలా చేరుస్తారని, న్యాయ సమీక్షకు వెళితే ప్రభుత్వం పరువు పోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షెడ్యూల్ ఏరియాలో గ్రామాల్లో ‘ పీసా’ గ్రామ సభ ఆమోదానికి అంతిమ నిర్ణయాధికారం ఉంటుందని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. గవర్నర్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ గిరిజన సంఘం గవర్నర్‌కు లేఖ రాసింది.
గిరిజన హక్కులకు భంగం..
ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందని ప్రజా సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన తప్పవని హెచ్చరిస్తున్నాయి.
Also Read:అందంపై అన్ని హక్కులూ కొనేసిందా ఏంటి?











