సడక్ సినిమా సంజయ్ దత్ కెరీర్ లో ఓ మైలు రాయి. మహేష్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్ హీరో హీరోయిన్లుగా 20 ఏళ్ల క్రితం ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది. దాని సీక్వెల్ గా ఇప్పుడు సడక్ 2 తెరకెక్కింది. ఇందులోనూ సంజయ్ దత్ ఉన్నారు. ఆలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కరోనా నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటి? : ఇందులో కూడా సంజయ్ దత్ టాక్సీ డ్రైవర్. భార్య పూజ (పూజా భట్) మరణం తర్వాత మానసిక వేదనకు గురవుతాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. తల్లిని కోల్పోయిన బాధలో అలియా భట్ కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని వెళుతుంది. ఆ ప్రయత్నాల్లో సంజయ్, పూజ కలుసుకొంటారు. ఆలియాను సొంత తల్లిదండ్రులు చంపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఆమె తల్లిదండ్రులకు దొంగ బాబా సహకరిస్తుంటాడు.
సంపన్నురాలైన ఆలియాను తల్లిదండ్రులే ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారనేది కీలక అంశం. ఈ విషయంలో ఆమె ప్రాణాలకు అడ్డుగా నిలుస్తాడు సంజయ్ దత్. ఆమెకు ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఆ కుట్రలో భాగమవుతాడు. ఈ నేపథ్యంలో ఆలియా తన ప్రియుడిని ఎలా మార్చింది? తన ప్రాణాలను ఎలా దక్కించుకొంది? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ఎలా తీశారు? : సినిమా కథ అంతా మలుపులతో సాగుతుంది. కొసమెరుపులుంటాయి. సినిమాలో ఎక్కువగా సాదాసీదా సన్నివేశాలే ఉంటాయి. సడక్ ను ఊహించుకుని ఈ సినిమా చూస్తే నిరాశే ఎదురవుతుంది. అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదు. దర్శకుడిగా మహేష్ భట్ విజయవంతం కాలేకపోయారు. పాత భట్ ను ఇందులో ఊహించుకోలేం. సంజయ్ దత్ కు కూడా చెప్పుకోతగ్గ పాత్ర దక్కలేదు. నటనలో ఆలియా భట్ మాత్రం మెప్పించింది. ఆమె తండ్రి పాత్రను పోషించిన జిషుసేన్ గుప్తా తన పాత్రను రక్తికట్టించాడు. హిల్స్ స్టేషన్, ప్రకృతి అందాలు సినిమాను ఆహ్లాదకరంగా మలిచాయి. కెమెరా పనితీరు బాగుంది. దొంగబాబా పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది.
నటీనటులు: సంజయ్ దత్, పూజ్ భట్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, జిషు సేన్‌గుప్తా, గుల్షన్ గ్రోవర్, మక్రంద్ దేశ్‌పాండే, ప్రియాంక బోస్, మోహన్ కపూర్, అక్షయ్ ఆనంద్ తదితరులు.
సాంకేతికవర్గం : సినిమాటోగ్రఫి: జే ఐ పటేల్, ఎడిటింగ్: సందీప్ కురుప్, మ్యూజిక్: జీత్ గంగూలీ, అంకిత్ తివారీ, సందీద్ ముఖర్జీ, ఉర్వీ, సునీల్జీత్, నిర్మాత: ముఖేష్ భట్.
రచన, దర్శకత్వం: మహేష్ భట్
ఎక్కడ చూడాలి: డిస్నీప్లస్ హాట్‌స్టార్
ఒక్క మాటలో: ఎక్కువ ఆశించి చూస్తే నిరాశే.
రేటింగ్ : 2/5
– పామర్తి హేమసుందర్











