మాలీవుడ్ లో గతేడాది సరిగ్గా ఇదే టైమ్ లో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. దివంగత దర్శకుడు సచ్చి మలిచిన ఈ యాక్షన్ ఎమోషనల్ మూవీ లో బిజు మీనన్ , పృధ్విరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించారు. ఈ సినిమాతో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. అందుకే ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా రీమేక్ చేస్తోంది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా సెట్లోకి ఇద్దరు హీరోలూ అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పైనా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు సమాచారం.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందట. జాన్ అబ్రహం తో పాటు మరో హీరోగా అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్టు సమాచారం. జాన్ అబ్రహం పోలీస్ గానూ,అభిషేక్ బచ్చన్ రిటైర్డ్ హవల్దార్ గానూ కనిపిస్తారట. గతంలో ఈ ఇద్దరూ నటించిన ధూమ్, దోస్తానా లాంటి సినిమాలు బాలీవుడ్ లో సూపర్ హిట్టయ్యాయి. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read: పవన్ ; రానా మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్