రాజు గారు జూలు విదిలించారండోయ్.. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అనేలా ఉంది ఇప్పుడు ప్రభాస్ వైఖరి. అతని సినిమాల దూకుడు మామూలుగా లేదు. పైగా ‘ఆదిపురుష్’ పేరుతో రామాయణం కథను ఎంచుకోవడం, పెదనాన్న కృష్ణంరాజు భాజపాలో ఉండటం.. ఈ తరుణంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం.. అంతకన్నా దూరం ఆలోచించలేం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ఆకాశం వైపు చూస్తూ పోజిచ్చిన ఫొటో ఒకటి నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. పైగా ఆ ఇద్దరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ‘చూశారా.. మేం ఎక్కడున్నమో’ అన్నట్టుంది ఆ ఫొటో. తెలుగు సినిమా రంగం ఎన్టీఆర్, అక్కినేని అనే రెండు కళ్లతో ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో రెబల్ స్టార్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో విలన్ పాత్రలతో సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. ఎన్టీఆర్, ఏయన్నార్ ల తర్వాతి స్థానాల్లో సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ్ శోభన్ బాబు ఉన్నారు.
చివరికి హీరో ఐదో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అంతకుమించి ఆయన స్థానం ఎదగలేదు. నిర్మాతగా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు కృష్ణంరాజు. ఆయనకు కుమారుడు ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండేదోగాని తన సోదరుడి కుమారుడు ప్రభాస్ ని సినిమాల్లోకి ప్రోత్సహించిరు. ఈరోజున సినిమా రంగంలో ప్రభాస్ స్థానం ఏమిటో అందరికీ తెలుసు. తెలుగు సినిమా రికార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే నాన్ బాహుబలి అనే మాట్లాడుకోవలసి వస్తోంది. అవన్నీ ఒక ఎత్తు, ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ ఒక ఎత్తు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది. ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ అన్నేళ్లు తన కెరీర్ ను పణంగా పెట్టాల్సి వచ్చింది. రాజమౌళికి అంత కాలం కాల్షీట్లు ఇచ్చి తప్పు చేశానా? అని ప్రభాస్ కు కూడా అనిపించి ఉండొచ్చు. అలాంటి విమర్శలు అన్నిటినీ మరచిపోయేలా చేసింది బాహుబలి ఘన విజయం.
ఇప్పుడు ప్రభాస్ గురించి రాయాల్సి వస్తే పాన్ ఇండియా స్టార్ అనే రాయాల్సి వస్తోంది. అంటే తెలుగు సినిమా అంకెలకు అందనంత దూరంలో ప్రభాస్ ఉన్నాడు. అసలు విషయంలోకి వచ్చేస్తే ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇది అందరినీ నివ్వెరపరిచే విషయం.
ఒక్కసారిగా ప్రభాస్ ఇంత స్పీడు పెంచుతాడని ఎవరూ ఊహించి ఉండరు. పైగా అతని రెమ్యూనరేషన్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పుడు చేస్తున్న ‘రాధేశ్యామ్’, ఓంరౌత్ దర్శకత్వంలోని ‘ఆదిపురుష్’, వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలకు కలిపి రూ. 300 కోట్లు ముట్టాయని చెబుతున్నారు. అంటే సినిమాకి వంద కోట్లు అన్నమాట. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించే యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’ కు కూడా రూ .100 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు చూసి మిగతా హీరోలు కూడా దూకుడు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
Must Read ;- గ్లింప్స్ టాక్: రోమియో, జూలియట్ తరహా ప్రేమకథే ‘రాధేశ్యామ్’

నిజానికి ఒకప్పుడు మన పెద్ద స్టార్స్ అంతా చకచకా సినిమాలు చేసిన వారే. ఆ తర్వాత ఏమైందో ఏమో ఏడాదికో, రెండోళ్లకో సినిమాలు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చాయేమో అని కూడా అనిపిస్తోంది. ప్రభాస్ తన ప్రతి చిత్రానికీ రూ. 75 కోట్ల నుంచి 80 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అంతేకాదు లాభాల్లో మరో 10 శాతం వాటా ఇవ్వాల్సిందేనట. ఇప్పుడు తెలుగులో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోల పారితోషికం రూ. 50 కోట్లు దాటలేదు. అందుకే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా వేరు చేసి చూస్తున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ ప్రభాస్ కెరీర్ కు సోపానంగా మారిందని చెప్పవచ్చు.
కోట్లలో బిజినెస్..
ప్రభాస్ సినిమాలకు కోట్లలో బిజినెస్ జరుగుతోంది. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ అనే చెప్పాలి. కానీ ఈ సినిమా బాలీవుడ్ లో భారీగా వసూళ్లు సాధించి హిట్ జాబితాలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఇలాంటి క్రేజ్ ఉండేది. అయితే ప్రభాస్ కు చిన్న వయసులోనే అలాంటి క్రేజ్ వచ్చేసింది. ఇక టైమ్ వృధా చేయడం మంచిది కాదన్న నిర్ణయానికి ప్రభాస్ వచ్చినట్టుంది. అందుకే స్పీడు పెంచేశాడు. సినిమాలకు ఈ స్థాయిలో బిజినెస్ చేయవచ్చనడానికి కేరాఫ్ అడ్రస్ గా తెలుగు పరిశ్రమే మారిపోయింది.
వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా వాటన్నింటినీ ఒకదాని వెంట ఇంకొకటి లైన్‌లో పెట్టేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఓ వైపు ‘సలార్’ చేస్తూనే ఇంకో వైపు ‘ఆదిపురుష్’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతోంది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ సినిమా సెట్స్ మీదికి వెళుతుంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తే, పెదనాన్న కృష్ణంరాజు దశరథుడి పాత్రను పోషిస్తున్నారట.
ఈ ఇద్దరూ రాధేశ్యామ్ లోనూ నటిస్తున్నారు. భాజపా రాజకీయాల్లో చురుకుగా ఉండే కృష్ణంరాజుకు ఈ ప్రాజెక్టు రాజకీయంగా ఆయనకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. కెరీర ప్లానింగ్ లో పెదనాన్ననే కాదు మిగతా తెలుగు హీరోలనూ ప్రభాస్ మించి పోయాడనే చెప్పాలి. అందుకే ‘ప్రభాసూ.. నువ్వు శెభాసు’ అనక తప్పదు. పెదనాన్న, ఈ అబ్బాయి ఆకాశం వైపు చూడటంలో అర్థం కూడా అదేనేమో.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడుగా బాలీవుడ్ హీరో