ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులపై ధ్వజమెత్తుతూ సుప్రీం కోర్టు సీజేకు ఉత్తరం రాయడం, దానిని బహిర్గతం చేసిన తీరుపై నమోదైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఆయనకు షోకాజు నోటీసులు ఇవ్వాలని, సీఎం పదవినుంచి తొలగించాలని రకరకాల పిటిషన్లు దాఖలయ్యాయి.
జగన్ లేఖ గురించి సుప్రీం కోర్టు విచారణ జరగబోతున్నదని అనగానే.. రాష్ట్రం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎలాంటి తీర్పు వస్తుందో.. అసలే కోర్టుల్లో అనేక ఎదురుదెబ్బలు తింటున్న ముఖ్యమంత్రికి.. ఈ విషయంలో ఎలాంటి అనుభవం వస్తుందో.. అని అంతా చూశారు. సోమవారం విచారణలో ఏం జరుగుతుందోనని, అటు జగన్ అభిమానులు, ఇటు వ్యతిరేకులు కూడా ఆసక్తిగా చూశారు. అయితే సస్పెన్స్ కు తెరపడలేదు.. విచారణ సాగలేదు. సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి.. తాను ఈ కేసును విచారించలేనని ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ ఈ సస్పెన్స్ కు కామా పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై తాను విచారణ చేపట్టలేనని జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ అన్నారు. ఆ కేసు విచారణ చేపట్టాల్సిన త్రిసభ ధర్మాసనానికి ఆయనే సారధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు లాయర్‌గా ఓ కేసులో జగన్ తరపున తాను వాదించాననీ…. కాబట్టి, ఇప్పుడీ కేసును తాను విచారించడం కరెక్టు కాదంటూ ఆయన దీని నుంచి తప్పుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్‌వీ రమణపై జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను మీడియాకు ఆయన సలహాదారు అజేయకల్లం విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో మాట్లాడిన తరువాత ఈ కేసును తగిన బెంచ్‌కు లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ ఉమేశ్ లలిత్ సూచించారు.
Also Read ;- ప్రజాభిప్రాయం ముసుగులో జగన్ మాట తప్పుతారా?!
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల వివరాలు :
సుప్రీంకోర్టులో మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్ లు ఇవాళ త్రిసభ్య ధర్మాసనంలో ఉన్నారు.
పిటిషన్లు వేసిన వారు: జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ సహా యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్
- న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ మీడియా సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసిన న్యాయవాది సునీల్ కుమార్ సింగ్
- న్యాయస్థానాలపై భవిష్యత్ లో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలన్న సునీల్ కుమార్ సింగ్
- ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పేందుకు సీఎం జగన్ కు షోకాజు నోటీసులు ఇవ్వాలని కోరిన సునీల్ కుమార్ సింగ్
- సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఏపీ సీఎంగా జగన్ ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన జిఎస్ మణి, ప్రదీప్ కుమార్
- వ్యక్తిగత ప్రయోజానాల కోసం సీఎం పదవికి అపకీర్తి తెస్తూ న్యాయమూర్తిపై బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేశారన్న జిఎస్ మణి, ప్రదీప్ కుమార్
- న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి,బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్, సలహాదారుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసిన యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్.
- Also Read ;- జగన్ అతి భక్తికి ఇది నిదర్శనమా?