తెరపై వాళ్లు కనిపిస్తే విజిల్స్ వేస్తాం. వాళ్ల పెర్ఫార్మెన్స్ కు మెస్మరైజ్ అవుతాం. కానీ తెరవెనక మాత్రం విషయం వేరు. సిల్వర్ స్క్రీన్ పై స్ట్రాంగ్ కనిపించిన ఎంతోమంది నిజజీవితంలో అప్పుల పాలయ్యారు. తెరపై మెరుపులు, మరకలు చూశారు.
సినిమా రంగంలో కోట్లకు పడగలెత్తినవారే కాదు.. అక్కడి నుంచి అమాంతం జారిపడ్డావారు సైతం ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్నోళ్లు ఎంతోమంది. సావిత్రి, పద్మనాభం లాంటి కొంతమంది మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ లిస్ట్ లో ఇంకెంతోమంది ఉన్నారు. ఉదాహరణకు చిత్తూరు నాగయ్యనే తీసుకుందాం. ఇప్పుడున్న హీరోలందరికీ ఆదిగురువు లాంటి వ్యక్తి. సౌత్ నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన తొలి నటుడు. ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించిన ఈయన తన జీవితం మొత్తం ఆర్థిక కష్టాలు చవిచూశారు. చరమాంకంలో డబ్బుల్లేకుండానే కన్నుమూశారు.
నిజంగా సినిమా కష్టాలంటే నాగయ్యవే. త్యాగయ్య సినిమా తర్వాత కోడంబాకంలో 52 ఎకరాల తోట కొన్నారు. స్టుడియో కట్టడం కోసం ఓ జమీందార్ ను ఆర్థిక సాయం కోరారు. స్టుడియో కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో జమీందార్ హ్యాండ్ ఇవ్వడంతో, నాగయ్య తీవ్రంగా నష్టపోయారు. అదే టైమ్ లో ఓ స్నేహితుడికి ఆర్థిక సహాయం కూడా చేయబోయి మరిన్ని నష్టాలు తెచ్చుకున్నారు. దీంతో ఎక్కడైతే స్టుడియో కట్టాలనుకున్నారో ఏకంగా ఆ తోటనే అమ్ముకోవాల్సి వచ్చింది.
నాగయ్య ‘ఆస్తుల త్యాగ’య్యగా..
నాగయ్య జీవితంలో ఇదొక అధ్యాయం మాత్రమే. అప్పట్లోనే భారీ పారితోషికం తీసుకున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగయ్యకు ఎప్పుడూ డబ్బు చేతిలో నిలవలేదు. ఏదో ఒక ప్రయత్నం చేయడం చేతులు కాల్చుకోవడం అలవాటుగా మారిపోయింది. ఒక దశలో తప్పనిసరి పరిస్థితుల మధ్య తానే నిర్మాతగా మారి రామదాసు కథను సినిమా తీశారు నాగయ్య. డబ్బుల్లేక ఏకంగా ఐదేళ్లు నిర్మించారు ఆ సినిమాని. నాగయ్యపై అభిమానంతో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, అంజలీ దేవి లాంటి ఎంతోమంది అందులో అతిథి పాత్రలు పోషించారు.
సినిమా బాగానే ఆడింది కానీ, నాగయ్య చేతికి మాత్రం ఏదీ అందలేదు. నాగయ్య చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలను కూడా ఎంజీఆర్ పంపిన డబ్బుతోనే చేయాల్సి వచ్చింది. హీరో హరనాథ్ ది మరో పరిస్థితి. ఇండస్ట్రీకొచ్చే ప్రతి నటుడు, తన జీవితం హరనాథ్ లా కాకూడదని కోరుకుంటాడంటే.. హరనాథ్ జీవితం, ఆయన అనుభవించిన ఆర్థిక కష్టాలు ఎంతలా టాలీవుడ్ ను ప్రభావితం చేశాయో అర్థచేసుకోవచ్చు. పుట్టుకతోనే ధనవంతుడు హరనాథ్. దేనికీ లోటులేటు.
పాతికేళ్లు నిండకుండానే సినిమా ఆఫర్లు. ఎన్టీఆర్ లాంటి నటుల ప్రశంసలు. దీంతో హరనాథ్ కిందామీద చూడలేదు. అదే టైమ్ లో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సిగరెట్లు, మద్యానికి అలవాటు పడ్డాడు. ఆ మద్యపానమే అతడి కెరీర్ ను నాశనం చేసింది. రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హరనాథ్ కాస్త, కళావిహీనంగా మారిపోయాడు. దీంతో సినిమా ఛాన్సులు ఆగిపోయాయి. మరోవైపు తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి తరిగిపోయింది. దీంతో జీవిత చరమాంకంలో తీవ్రమైన ఆర్థిక కష్టాలు చూశారు హరనాథ్. మద్యం కోసం తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు అడుక్కునే వాళ్లని ఇప్పటికీ చెప్పుకుంటారు.
Also Read ;- ఎన్టీఆర్ రత్నం కాదా?.. భారతరత్న ఎందుకు రాదు?
కత్తి కాంతారావు బొత్తిగా..
మహానటుడు ఎన్టీఆర్ కు సమకాలికుడైన కత్తి కాంతారావు పరిస్థితి కూడా అంతే. అతను మంచి అందగాడు. జానపద చిత్రాల్లో కాంతారావు కత్తి యుద్ధం చూడముచ్చటగా ఉండేది. ఎంతో ఎదిగాడో అంతగా ఒదిగిపోయారు. కారణం సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడమే. నాగయ్య, హరనాథ్ కు పూర్తి భిన్నమైన నేపథ్యం పద్మనాభంది. నాగయ్యకు కాలం కలిసిరాక అప్పులు పాలయ్యారు. హరనాథ్ తన చెడు వ్యసనాలతో ఇబ్బందులు పడ్డారు. పద్మనాభం మాత్రం అతి మంచితనంతో డబ్బులు పోగొట్టుకున్నారు.
సినిమా వైభవం అనే సినిమా కోసం 1975లో అప్పు చేశారు పద్మనాభం. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, శ్రీరామకథ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చకుంటే, అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ నెగెటివ్ రైట్స్ తీసుకోవచ్చు. పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దీంతో ఆ సినిమాల నెగెటివ్ రైట్స్ ను అప్పిచ్చిన వ్యక్తి అమ్ముకున్నాడు. పద్మనాభంకు తిరిగి డబ్బివ్వలేదు సరికదా, సినిమాల నెగెటివ్స్ కూడా ఇవ్వలేదు. వరుసగా 4 సినిమాలుగా డబ్బులు రాకపోవడంతో పద్మనాభం ఆర్థికంగా చితికిపోయారు. జీవిత చరమాంకంలో కూడా ఆయన దగ్గర డబ్బుల్లేవ్.
హీరో ఉదయ్ కిరణ్ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడనే విషయం ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ నటుడికి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోయింది. దీంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన ఉదయ్ కిరణ్, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెండితెరపై యాంగ్రీ యంగ్ మ్యేన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కు ఒక దశలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.
కెరీర్ బాగా డల్ అయిన టైమ్ లో తానే డబ్బులు పెట్టి కొన్ని సినిమాలు తీశారు. అవన్నీ ఆయనకు నష్టాలే మిగిల్చాయి. ఒక దశలో అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక, చెన్నైలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న 2 ఇళ్లను రాజశేఖర్ అమ్ముకున్నారు. అలా ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డారు. ఇలా ఏ నటుడి జీవితంలోకి తొంగి చూసినా ఇలాంటి చేదు అనుభవాలెన్నో కనిపిస్తాయి. అందుకే కొందరు హీరోలు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి వారి మీద ‘పిసినారి’, ‘పిల్లికి బిచ్చం వేయడు’ లాంటి ముద్రలు వేస్తుంటారు.
Must Read ;- కట్టప్పను మించిపోవాలి.. అప్పుడే అదిరిపోయే ఆఫర్లు