స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను కట్టడి చేసేందుకు వైసీపీ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన 9 గ్రానైట్ క్వారీలను గతంలోనే మూసివేశారు. రవికుమార్ హైకోర్టును ఆశ్రయించిన కొన్ని క్వారీలను తెరిపించుకోగలిగారు. అయితే ఇప్పుడు, రవికుమార్‌కు చెందిన గ్రానైట్ క్వారీలు, కంపెనీలపై మరోసారి తనిఖీలు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయకుండా నిలువరించేందుకే వైసీపీ నేతలు ఈ ఎత్తుగడ వేశారని ఊహాగానాలు సాగుతున్నాయి.
లొంగదీసుకునేందుకే
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైట్ క్వారీలు, కంపెనీలను మూసివేశారు. ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుకు చెందిన వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. అయినా ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే వైసీపీలో చేరారు. మరో ముగ్గురిని కూడా కట్టడి చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా వారు నిర్వహించే వ్యాపారాలను నిబంధనల అతిక్రమణ పేరుతో మూసివేయిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి గొట్టిపాటి రవికుమార్ కంపెనీలపై భూగర్భ గనుల శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
ప్రకాశం జిల్లాలో గట్టి ఆర్థిక మూలాలు ఉన్న నేతల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒకరు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఆర్థికంగా సాయం చేస్తారనే అనుమానంతో గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలను మూసివేయించేందుకు వైసీపీ నేతలు గనుల శాఖ అధికారులను ఉపయోగించుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఉదయం నుంచి గొట్టిపాటికి చెందిన గుంటూరు జిల్లా నాందెడ్ల మండలం యడవల్లిలోని కిషోర్ స్లాబ్ అండ్ టైల్స్, రాజపేట సమీపంలోని కిషోర్ స్టోన్స్ గ్రానైట్ కంపెనీలను అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
చిలకలూరిపేట సమీపంలోని కిషోర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిషోర్ స్టోన్స్ కంపెనీల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. మార్టూరు మండలం జొన్నతాళి వద్ద ఉన్న గ్రానైట్ కంపెనీలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇవాళ కూడా తనిఖీలు కొనసాగుతాయని గనుల శాఖ అధికారులు వెల్లడించారు.
ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యం
టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, బాబూరావు వైసీపీలో చేరిపోయారు. ఇక మిగిలిన నేతల వ్యాపారాలను దెబ్బతీసేందుకు ఉన్న అన్నీ అవకాశాలను వైసీపీ నేతలు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎంతకీ లొంగకపోవడంతో ఇక మిగిలిన ఒకటి రెండు గ్రానైట్ కంపెనీలను కూడా సీజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గనుల శాఖ అధికారులు గొట్టిపాటి కంపెనీలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైట్ కంపెనీల్లో మిగిలిపోయిన వాటిని ఇవాళ (బుధవారం) సీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Must Read ;- తిరుపతి తీర్పుతో వైసీపీకి బుద్ధి చెప్పండి: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి