శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమా ద్వారా కిషోర్ బి దర్శకుడిగా పరిచయమయ్యారు. నేటి పల్లె జీవన విధానం, వ్యవసాయం ఎలాంటి పరిణామాలకు లోనవుతోందన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కొత్త దర్శకుడు కిషోర్ ఈ కథకు న్యాయం చేశారా? లాంటి విషయాలను తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
పల్లెలు కళ తప్పుతున్నాయి. ఏ పండగో చావో వస్తే తప్ప పల్లెలకు జనం రావడం లేదు. హీరో కొడుకు హీరో అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు. ఎందుకీ పరిస్థితి ఉంది అనే లైన్ తీసుకుని అల్లిన కథ ఇది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కార్తీక్ (శర్వానంద్) సంక్రాంతికి తన సొంతూరుకు వెళ్లడంతో కథ మొదలవుతుంది. అతని తండ్రి కేశవులు (రావు రమేష్) ఆ పల్లెనే నమ్ముకుని పొలం తాకట్టు పెట్టుకుని అప్పు తచ్చుకుంటూ బతుకు జీవనం సాగిస్తుంటాడు. ఆ ఊళ్లో ఉండే చాలామంది పొలాలను తాకట్టుపెట్టుకుని అప్పులు తెచ్చుకుని బతుకు భారమై పట్నాలకు చేరుకుని ఏదో ఒక పనిచేసుకుంటూ బతుకుతుంటారు.
రైతుల పొలాలను కాజేయాలనే దురుద్దేశంతో వారికి అప్పులిస్తూ వారిని పీల్చి పిప్పి చేస్తుంటాడు ఏకాంబరం (సాయికుమార్). అతని మామ పేరుతో ఉన్న అనంతరాజపురం పేరు కాస్తా ఏకాంబర పురంగా మార్చాలన్నది అతని కల. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కార్తీక్ వ్యక్తిత్వం నచ్చి అతన్ని ప్రేమిస్తుంది చైత్ర (ప్రియాంక అరుళ్ మోహన్). అతన్ని పెళ్లి చేసుకోడానికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తారు. కానీ తను ఉద్యోగం వదలుకుని వ్యవసాయం చేయాలనుకుంటాడు కార్తీక్. అలా సొంతూరు చేరుకుని ఉమ్మడి వ్యవసాయానికి రైతుల్ని పోత్రహిస్తాడు. అతను అలాంటి నిర్ణయం తీసుకోడానికి కారణం ఏమిటి? ఆ పయనంలో అతనికి ఎదురైన ఇబ్బందులేమిటి? అన్నదే ప్రధాన కథ.
ఎలా చేశారు? ఎలా తీశారు?
నేటి పలెల్లో ఉన్న పరిస్థితిని చూపించాలని దర్శకుడు పడ్డ తపన ఈ చిత్రంలో కనిపిస్తుంది. భావోద్వేగాలను పండించడంలో అతను తీసుకున్న ప్రత్యేక శ్రద్దను అభినందించాలి. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన సంఘర్షణను చక్కగా ఆవిష్కరించారు. కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన తండ్రి.. ఆ తర్వాత కొడుకు సాధించిన విజయం చూసి అంతర్మథనం మన హృదయాలను హత్తుకుంటుంది. ముఖ్యంగా కేశవులు పాత్రలో రావు రమేష్ జీవించారు. పల్లె టూళ్లో సగటు తండ్రి ఎలా ఉంటాడో అలానే ఆయన ఈ సినిమాలో కనిపించారు. ముఖ్యంగా ఈ తండ్రిలో ఈ రియలైజేషన్ సన్నివేశాన్ని విజువలైజ్ చేయడంలో దర్శకుడు కిషోర్ ప్రత్యేకత కనిపిస్తుంది.
కొడుకును బైక్ మీద ఎక్కించుకుని తీసుకొస్తుంటే ఆయన కన్నీటి బిందువు జారి వెనక కూర్చున్న కార్తీక్ చెంపను తాకుతుంది. అప్రయత్నంగా కార్తీక్ చేయి తండ్రి భుజంపై పడుతుంది. అదలాగే ఉండనియ్ అంటాడు కేశవులు. సినిమాలో ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు కిషోర్ సక్సెస్ అయ్యారన్ని చెప్పాలి. సినిమా ప్రథమార్థంలో వచ్చే లవ్ ట్రాక్ కొంత విసిగిస్తుంది. సినిమాకి కావలసిన కమర్షియల్ అంశాల కోసం సాఫీగా సాగుతున్న కథను గాడి తప్పించినట్టు అనిపిస్తుంది. కార్తీక్ గా శర్వానంద్ నటనను మెచ్చుకోవాలి. ప్రియాంక కూడా తనదైన రీతిలో ఆ పాత్రను రక్తి కటించింది. రావు రామేష్, వీకే నరేష్ నటన ఈ సినిమాకి హైలైట్ అనుకోవాలి. సత్య టైమింగ్ ఇందులో కూడా ఏమీ తగ్గలేదు. సినిమాకి ఓ విలన్ ఉండాలి కాబట్టి సాయికుమార్ పాత్రను అలా కొనసాగించారు.
ఆ పాత్ర మారిన విధానం లాజిక్ కు అందలేదు. కన్విన్సింగ్ గా కథను చెప్పడంలో కొన్ని లోపాలు దొర్లినట్లు అనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ రీరికార్డింగ్ ఈ కథకు న్యాయం చేసింది. డైలాగుల్లో అక్కడక్కడా మెరుపు కనిపించింది. బుర్రా సాయిమాధవ్ పదునైన మాటలు సినిమాను చాలావరకు ముందుకు నడిపించాయి. రేపటి భవిష్యత్తు అంతా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎందరో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వ్యవసాయ చేస్తున్నారు. ఉద్యోగాలు వదులుకుని పల్లెలకు చేరుతున్నారు. ఇలాంటి సినిమాల ద్వారానైనా మళ్లీ పల్లెలకు కళ వస్తుందని ఆశించవచ్చు.
శ్రీకారం రివ్యూ :
నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, సాయికుమార్, ఆమని, రావు రమేష్, వీకే నరేష్, సత్య, సప్తగిరి, మురళీశర్మ, దేవీ ప్రసాద్ తదితరులు.
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: జే. యువరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం: కిషోర్ బి
విడుదల తేదీ: 11-03-2021
ఒక్క మాటలో: పల్లెకు కళ తెచ్చే ప్రయత్నం
రేటింగ్: 2.75/5











