దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినా.. తెలంగాణలోని హుజూరాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికే అందరినీ మునివేళ్లపై కూర్చోబెట్టేసింది. గత నెల 30న పోలింగ్ జరగగా.. మంగళవారం నాడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సుధీర్ఘంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో చివరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను విజయం వరించింది. గెలిచి తీరాలన్న కసితో సాగిన టీఆర్ఎస్ మాత్రం అనూహ్యంగా ఈ ఎన్నికలో ఓటమి పాలైపోయింది. ఇక ఇరు పార్టీలకు చుక్కలు చూపిస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ ఏ రీతిన గెలిచినా.. టీఆర్ఎస్ ఓటమిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. అసలు టీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలేమిటన్న దిశగా సాగుతున్న ఈ విశ్లేషణల్లో.. ఏ రీతిన గులాబీ దళం అభాసుపాలైందన్న వైనంపై సరికొత్త కారణాలు వెలుగు చూస్తున్నాయి.
దెబ్బేసిన దళిత బంధు
హుజూరాబాద్ ఎన్నికల్లో గులాబీ దళానికి దెబ్బేసిన వాటిలో ముందు వరుసలో ఉన్నది మాత్రం దళిత బంధు పథకమే. దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ఈ పథకం మంచిదేనని దాదాపుగా అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలే వినిపించినా.. హుజూరాబాద్ ఎన్నికలు ముగియంగానే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎత్తిపారేస్తారన్న ప్రచారం కూడా హోరెత్తింది. దానికి తోడు.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల మేర నిధులు జమ చేసినా.. వాటిని ఫ్రీజ్ చేసిన వైనం కూడా ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్మేలా చేసిందని చెప్పాలి. అంతేకాకుండా దళితులకు మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్.. మాకేమీ చేయరా? అంటూ ఇతర సామాజిక వర్గాలు కూడా ప్రశ్నించాయి. వెరసి పథకం మంచిదే అయినా కూడా ఈ పథకాన్ని ప్రకటించిన సమయం, అమలు చేసిన తీరుతో జనంలో కేసీఆర్ సర్కారు అనుమానాలను రేకెత్తించాయి. దళితేతరులను ఆసంతృప్తికి గురి చేసిన ఈ పథకం.. అమలులో మాత్రం దళితులను కూడా తీవ్ర అసహానానికి గురి చేసిందని చెప్పాలి. వెరసి హుజూరాబాద్ ఎన్నికను గెలవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు టీఆర్ఎస్‌కు ఓటమిని చవిచూపించింది.
ఎన్నెన్నో రీజన్లు..!
దళిత బంధుతో పాటుగా టీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట లాగేసిన టీఆర్ఎస్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెద్బకొట్టేందుకు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని లాగేసుకుంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినా.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్‌కు ఓటమి రూపంలో మరింత మేర దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం మంత్రి హరీశ్ రావు భుజాలపైనే కేసీఆర్ పెట్టేశారు. పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ కుమారుడికి ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్.. ఆది నుంచి తన వెంట నడిచిన మేనల్లుడిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్న వాదన కూడా జనంలో బాగానే ప్రబలింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న హరీశ్ ను కనీసం పార్టీ ప్లీనరీకి కూడా ఆహ్వానించకపోవడం కూడా టీఆర్ఎస్ శ్రేణులను అసంతృప్తికి గురి చేసింది. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా హుజూరాబాద్‌లో ఎక్కడ ఓడిపోతామోనన్న భయం కూడా టీఆర్ఎస్ ఓటమిలో కీలక భూమిక పోషించిందని చెప్పాలి. గెలుపు కోసం ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు గులాబీ నేతలు పంచారని ప్రచారం సాగింది. ఈ క్రమంలో కొందరు ఓటర్లు తమకు ఎందుకు డబ్బులు ఇవ్వరంటూ బజారుకు ఎక్కి మరీ టీఆర్ఎస్‌కు శాపనార్ధాలు పెట్టేశారు. ఈ పరిణామం కూడా టీఆర్ఎస్‌కు పరాభవాన్ని ఖరారు చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి ఎక్కడ ఓడిపోతామోనన్న భయం టీఆర్ఎస్‌ను ఓటమి అంచులకు చేర్చిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- వైసీపీ గెలిచినా టార్గెట్ మిస్!










