స్టార్ హీరోతో ఒక్క సినిమా చేస్తే చాలు.. తమ జన్మ ధన్యమైపోయినట్టే అన్నట్టు ఫీలవుతారు చాలా మంది దర్శకులు. అయితే అదే స్టార్ తో వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశం వస్తే ఆ దర్శకుడు ఇండస్ట్రీలో తోపు కిందే లెక్క. అలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న తమిళ దర్శకుడు శివ.
అజిత్ తో మొత్తం నాలుగు సినిమాలు చేశాడు దర్శకుడు శివ. అందులో మూడు సినిమాల్ని వరుసగా తెరకెక్కించడం నిజంగా వండర్ అనే చెప్పుకోవాలి. ‘వీరమ్, వేదాళం, వివేగం, విశ్వాసం’ సినిమాలు రూపొందించిన శివ.. వాటిలో ‘వేదాళం, వివేగం, విశ్వాసం’ సినిమాల్ని వెంటవెంటనే తెరకెక్కించాడు. ఇప్పుడు శివ బాటలో వేరే దర్శకుడు ట్రావెల్ అవుతుండడం కోలీవుడ్ లో విశేషంగా మారింది. అతడి పేరు హెచ్.వినోద్. ఈ దర్శకుడు కూడా అజిత్ తో వరుస సినిమాలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రముఖ సినిమాటో గ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణియన్ అలియాస్ నట్టి.. హీరోగా ‘చతురంగ వేట్టై’ అనే సినిమా రూపొందించి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు హెచ్.వినోద్. ఇదే సినిమాను తెలుగులో సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ గా తీసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత వినోద్ కార్తి తో తీసిన ‘ధీరన్ అదిగారం ఒండ్రు’ (తెలుగులో ఖాకీ గా విడుదలైంది)కూడా సూపర్ హిట్టే.
ఈ రెండు సినిమాల క్రేజ్ తో వినోద్.. అజిత్ తో బాలీవుడ్ పింక్ రీమేక్ గా నేర్కొండ పారవై తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా తమిళనాట సూపర్ హిట్టవడంతో .. అజిత్ వినోద్ తో వెంటనే మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా వలిమై. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. ఇక అజిత్ తదుపరి చిత్రం కూడా హెచ్.వినోదే రూపొందించ నుండడం విశేషంగా మారింది. ఇది అజిత్ 61వ సినిమాగా రాబోతోంది. వలిమై… కంప్లీట్ కాగానే .. అజిత్ ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మరి శివ లాగానే .. వినోద్ కూడా అజిత్ కు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
Must Read ;- అజిత్ తో బోనీ మరో సినిమా నిర్మిస్తాడట!










