కొవిడ్ -19 ఉధృతి కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురికి లేఖ రాశారు. ‘‘కొవిడ్ వైరస్ వ్యాప్తి ఈ సీజన్ లో ఎక్కువైంది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ త్వరలో రానుంది. వచ్చే సమావేశాలను త్వరలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దీనిపై మండి పడింది. ‘అందరినీ సంప్రదించామంటున్నారు..కాని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించలేద’ని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్లమెంటరీ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం పతనం చేస్తోందని విమర్శించింది. కొవిడ్ ఉన్న టైంలో ఎన్నికలకు వెళ్లవచ్చు..ప్రచారం చేయవచ్చు..కాని పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలంటే మాత్రం కొవిడ్ -19 అడ్డంకిగా ఉందా’ అని ప్రశ్నించింది. బీహార్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. కొవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయలేదు. పార్లమెంటు కొత్త భవనానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా వాయిదా పడలేదు. రైతుల ఆందోళనలపై చర్చను తప్పిచుకునేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శించారు.
ఆ విమర్శలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న తరువాత చాలావరకు కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగాయి. బహిరంగ సభలూ జరిగాయి. అయితే కేవలం కొవిడ్ పేరుతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాయిదా వేయడం అంటే.. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు..పార్లమెంటులో చర్చకు రాకూడనే ఉద్దేశమే ఇందుకు కారణంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Must Read ;- తాడోపేడో : చట్టాలు రద్దు చేసే వరకు అంగుళమైనా కదలం
17రోజుల నుంచి ఢిల్లీలో రైతుల ఆందోళన
దాదాపు 17రోజుల నుంచి ఢిల్లీలో రైతుల ఆందోళన నడుస్తోంది. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను రైతులు లెక్కచేయడం లేదు. మరో ఏడాదైనా సరే.. తమ ఆందోళన కొనసాగుతుందని, నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, కశ్మీర్ రైతులు చేస్తున్న ఆందోళనల కారణంగా ఆయా రాష్ట్రాల్లో రోజుకు రూ.5వేల కోట్ల విలువైన ఉత్పాదకత కోల్పోతున్నట్టు సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) అంచనా వేస్తోంది. దేశంలో ఏవైనా ఘటనలు జరిగినప్పుడు, దాడులు లేదా ఏవైనా కుట్రలు బయటపడినప్పుడు మినహా ఈ స్థాయిలో ఆందోళన జరగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోమంత్రి అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఇక రైతులకు మద్దతుగా ఎన్డీఏ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్దతు లభిస్తోంది. భారత్ బంద్ జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు పెడితే.. ఇటు పార్లమెంటులో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. భారీ సంఖ్యలో ఢిల్లీ శివార్లలో రైతులు ఉన్నారు. వారు శాంతియుతంగానే తమ ఆందోళన చేస్తున్నారు. వారి మధ్య సంఘ విద్రోహ శక్తులు చొరబడితే.. భద్రతాపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదీ కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున రైతులు చేస్తున్నఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్వరలో అంటే..
వచ్చే ఏడాది జనవరి తరువాత సమావేశాలు జరిపే అవకాశం ఉందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ లోగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతోంది. 700 సదస్సులు, 700 ప్రెస్ మీట్ లు జరిపి ఈ వ్యవసాయ చట్టం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేయాలని, తద్వారా ఆందోళనలు తగ్గించవచ్చని బీజేపీ ప్రణాళిక కూడా వేసింది. అంటే.. టైం గడుస్తున్న కొద్దీ.. ఆందోళనలకు మద్దతు తగ్గించడం, మరోవైపు చర్చలు జరపడం, ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడం లాంటి వ్యూహాలకు బీజేపీ పదును పెట్టిందని చెప్పవచ్చు.
కొవిడ్ భయం ఇందుకేనా..
మరోవైపు కొవిడ్ భయం ఇంకా ఎంపీలను వెంటాడుతోందని, పలువురు ఎంపీలు కొవిడ్ కారణంగా చనిపోయారనే అభిప్రాయం కూడా కలుగుతోంది. కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా కారణంగా చనిపోయిన విషయం కూడా చర్చకు వస్తోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ బారిన పడ్డారని తాజాగా సర్వేలు చెబుతున్నాయని, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
గతంలో ఇలా..
గతంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలాసార్లు రద్దు చేశారు. అప్పటి రాజకీయ, ఆర్థిక, దేశ భధ్రత లాంటి అంశాల కారణంగా వాయిదా పడ్డాయి. 1975, 1979, 1984లో ఇలా శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఇక 1978,1995, 2002 తోపాటు పలు సందర్భాల్లో తక్కువ రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగిన సందర్భాలున్నాయి.
Also Read ;- నిజమా? : అంబానీ మనవడిని చూసే టైం మోడీకి ఉందా?