అసలే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అభిమానులు.. రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు కామెంట్ చేసినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తారు. అందుకు ఆ మధ్య పోసాని వ్యహారమే ఓ ఉదాహరణ. రేవంత్ రెడ్డికి ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్లుగా కనిపిస్తున్న సంఖ్య కంటే.. బయట ఫేస్ బుక్ గ్రూపులు, సైన్యాలు చాలా ఉన్నాయి. తమ నాయకుడికి టీపీసీసీ దక్కకుండా చేసేందుకు చాలా మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని ఇటు టీఆర్ఎస్‌పై, అటు కాంగ్రెస్ నాయకుల్లో కొంతమందిపై ఆగ్రహంతో ఉన్న రేవంత్‌రెడ్డి అభిమానులు రెండురోజులుగా ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై విరుచుకు పడుతున్నారు. ఇందుకు మొన్న ప్రెస్‌మీట్‌లో ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఉన్న కేసులకు సంబంధించి మీడియాతో చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలే కారణం.
చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని చెబుతూ.. ఏలేరు కాల్వ పనుల్లో అవినీతిపై స్టే అని మొదలుపెట్టి.. పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ‘ఓటుకు నోటు కేసులో ఒకాయన దొరికాడు.. పొట్టిగా ఉంటాడు.. అటూ ఇటు తిరిగి హడావుడి చేస్తాడు’ అని వ్యాఖ్యానించడంతో పేర్ని నానిపై రేవంత్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో పేర్ని నానిపై అవినీతి ఆరోపణలతో పోస్టులు చేయడంతో పాటు వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ విషయాల్లోనూ కామెంట్లు చేస్తూ పరువుతీసేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. రాసేందుకు వీలుకాని భాషలోనూ పేర్ని వెంకట్రామయ్యపై పోస్టులు చేస్తున్నారు.
Must Read ;- కార్యకర్తలలో ధైర్యాన్ని నింపిన రేవంత్ రెడ్డి
అయితే రేవంత్ రెడ్డి అభిమానులు ఇంతలా రియాక్ట్ కావడానికి కారణం కూడా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పేర్ని వెంకట్రామయ్య మచిలీపట్నంనుంచి గెలిచారు. అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉన్నారు. పేర్ని నాని కాంగ్రెస్ పార్టీ కాగా అప్పట్లో రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి పేర్ని వెంకట్రామయ్యకు తెలిసే అవకాశమే ఎక్కువ. ఒకవేళ తెలియదని భావించినా.. పరోక్షంగా రేవంత్‌ని ఉద్దేశించి ‘పొట్టిగా ఉంటాడు..హడావుడి చేస్తాడు’ అనే వ్యాఖ్యలు చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా.. ఏపీలో సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా రాజకీయాలున్నాయి. టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉండడం, రెండురోజుల క్రితం ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక రావడం, రేవంత్ ని టీపీసీసీసీ అధ్యక్షుడిగా కాకుండా చేసేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఇప్పటికే ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌పై వ్యతిరేక కామెంట్లు ఎవరు చేసినా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు ఆయన అభిమానులు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీనే కాదు.. రేవంత్ కి సంబంధించి ఎవరు కామెంట్ చేసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం లేదు.. అయినా మా నాయకుడిపై వ్యక్తిగత విమర్శలకు దిగాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నను వేస్తున్నారు. ఏపీలో మీరూ మీరూ తేల్చుకోండి.. మా నాయకుడి జోలికి రావద్దని పోస్టులు చేస్తున్నారు కూడా.
ఇక పేర్ని వెంకట్రామయ్యపై రేవంత్ అభిమానులు చేస్తున్న విమర్శలకు వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నా.. రేవంత్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓరకంగా పరోక్షంగా బెదిరింపులకూ దిగుతున్నారని చెప్పవచ్చు. మొత్తంమీద పేర్ని నాని చంద్రబాబుపై విమర్శలు చేస్తూ మాటల్లో మాటగా ఈ కామెంట్లు చేశారా లేక ఉద్దేశ పూర్వకంగా కామెంట్ చేశారా అనే విషయం పక్కన బెడితే.. పేర్ని నానిని మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పవచ్చు.
Also Read ;- టీకాంగ్రెస్‌కు సరైనోడు ఎవరు.. డైలమాలో అధిష్టానం