నారా లోకేశ్.. తండ్రి చాటు తనయుడు. మాటలే సరిగ్గా పలకలేరు. ఇక పాలన చేతనవుద్దా? టీడీపీని నడపడం ఆయన తరమా? చంద్రబాబు తర్వాత పార్టీకి దిక్కెవరు? జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. జూనియర్ కాదంటే… ఇంకెవరు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. అన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడపగల సత్తా తనకుంది అని లోకేశ్ చాటుకున్నారు. ఒక్కటంటే ఒక్క దెబ్బతో పై ప్రశ్నలన్నింటికీ లోకేశ్ సింగిల్ ఆన్సర్ ఇచ్చేశారు. ఈ సింగిల్ ఆన్సర్ తోనే… తనపై వెల్లువెత్తుతున్న ట్రోలింగ్ దెబ్బలకు బ్రేకులేసేశారు. అంతేకాదండోయ్… ఏకంగా దేశంలోనే #థ్యాంక్యూలోకేశ్అన్నాహ్యాష్ ట్యాగ్ ను దేశంలోనే ట్రెండింగ్ లో నిలిపారు. మొత్తంగా తన సమర్థతపై పేలుతున్న తూటాలన్నీ కేవలం టపాసులేనంటూ నిరూపించేశారు. వెరసి టీడీపీకి భవిష్యత్తు అధినేతగా అందరి ఏకైక ఛాయిస్ గా నిలిచారు.
సామాన్య కార్యకర్తగానే ఎంట్రీ
రాజకీయాల్లో వారసత్వంపై లెక్కలేనన్నిఈక్వేషన్లు. అయితే ఇతర రంగాల్లో వారసత్వం పనికొస్తుందేమో గానీ… రాజకీయాల్లో మాత్రం అది పనికి రాదనే చెప్పాలి. ఇందుకు వర్ధమాన రాజకీయాల్లో లెక్కలేనన్ని ఉదాహరణలు. రాజకీయ నేతగా ఎదగాలంటే.. సత్తా చాటే నాయకులకే అది సాధ్యం. లోకేశ్ కూడా ఈ విషయాన్ని నిరూపించారు. పేరుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడే అయినా… పార్టీలో కిందిస్థాయి నుంచి లోకేశ్ ఎదిగారు. రాజకీయాల్లోకి వచ్చీరాగానే… తనకు ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో.. కావాలని లోకేశ్ అడగలేదు. పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఎంట్రీ ఇచ్చిన లోకేశ్… దేశంలోనే అత్యదిక సభ్యత్వం కలిగిన పార్టీగా టీడీపీకి గుర్తింపు తీసుకువచ్చారు. ఈ ఒక్క చర్యతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో సాగిన లోకేశ్ కు ఒకింత కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం… పార్టీ కార్యకర్తల సంక్షేమ వ్యవహారాలను అప్పజెప్పింది.
కార్యకర్తలకు బీమా సౌకర్యం
పార్టీ సంక్షేమ వ్యవహారాల బాధ్యతలను భుజాన వేసుకున్న లోకేశ్.. మరింత ఉత్సాహంగా పనిచేశారు. పార్టీకి ఏళ్ల తరబడి అండగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో సాగిన లోకేశ్… పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించారు. కోట్లాది రూపాయల ప్రీమియాన్ని పార్టీ తరఫునే చెల్లించేలా చేసిన లోకేశ్… రూపాయి కట్టకుండానే లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని ఇప్పించారు. ఈ బీమా కింద ఏదేనీ ప్రమాదంలో కార్యకర్త చనిపోతే… బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం, శాశ్వత అంగవైకల్యం కలిగితే కూడా రూ.2 లక్షల పరిహారం, పాక్షిక అంగవైకల్యానికి రూ.1 లక్ష పరిహారం అందేలా చర్యలు చేపట్టారు. ఈ తరహాలో పార్టీ కేడర్ కు బీమా చేయించిన పార్టీగా కూడా దేశంలోనే టీడీపీకి మంచి గుర్తింపు వచ్చేలా లోకేశ్ వ్యవహరించారు. ఈ దెబ్బతో లోకేశ్ కు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఆ వెంటనే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు దక్కితే.. అందుకనుగుణంగానే లోకేశ్ కు కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా దక్కింది.
Must Read ;- లోకేష్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కోవిడ్ నుంచి బయటపడిన గొడవర్రు గ్రామస్థుల ప్రశంసలు
పార్టీ గెలుపే… తన గెలుపుగా
2014 ఎన్నికల సమయంలో పార్టీలో కీలక పదవిలో ఉన్న లోకేశ్ అడిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థానం నుంచి అయినా పోటీ చేసే అవకాశం లభించేది. అయితే ఇప్పుడప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాల్సిన అగత్యం తనకు లేదని, ఇంకొంతకాలం పార్టీ నిర్మాణం, పటిష్టత, కార్యకర్తల సంక్షేమంపైనే దృష్టి సారిస్తానని లోకేశ్ చెప్పారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీకి దిగకుండానే… పార్టీ, పార్టీ తరఫు బరిలో నిలిచిన అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశారు. లోకేశ్ తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తల సమిష్టి కృషితో ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టింది. అయినా కూడా అదికారానికి దూరంగానే ఉండిపోయిన లోకేశ్… పార్టీ అధిష్ఠానం చెప్పేదాకా వేచి చూశారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టిన లోకేశ్… చంద్రబాబు మంత్రివర్గంలోనూ చేరిపోయారు. తొలిసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా… సీఎం ఆదేశాల మేరకు ఏకంగా మూడు కీలక శాఖల బాధ్యతలన చేపట్టిన లోకేశ్.. వాటిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఆయా శాఖలకు కేంద్రం నుంచి అందిన అవార్డులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి.
ఓడినా ప్రజా క్షేత్రంలోనే…
ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలోని విచిత్ర రాజకీయాల కారణంగా టీడీపీ ఓటమిపాలైంది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ జనాలను తన బుట్టలో వేసుకోగలిగారు. వెరసి నూతన రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో పోటీకి దిగిన లోకేశ్ ఓడిపోయారు. ఓటమితో ఏమాత్రం నిరత్సాహపడకుండా లోకేశ్ తనదైన పరిణతిని చూపారు. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమేనని చెప్పిన లోకేశ్… ఓడినా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ప్రజలకు అండగా నిలుస్తానని ప్రకటించారు. ఆ మాదిరిగానే ప్రజా సమస్యలపై ఆయన నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ లోని నిజమైన నేత జనాలకు కనిపించడం మొదలైందని చెప్పాలి. ఏ విషయంలోనూ దారితెన్నూ లేకుండా సాగకుండా… ఆయా విషయాలపై తనదైన శైలి విశ్లేషణ చేసుకుని ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విమర్శలు నలుదిక్కులా చుట్టుముట్టినా.. చిరునవ్వుతోనే వాటికి సమాధానం చెబుతూ సాగారు.
పరీక్షలపై స్పష్టమైన అవగాహన
ఇలా తనదైన వ్యూహంతో సాగుతున్న లోకేశ్… ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. కరనా నేపథ్యంలో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే జరిగే నష్టమేమిటన్న అంశాన్ని అందరికంటే ముందు వెల్లడించారు. పరీక్షలు పెడితే.. పెను ప్రమాదమేనని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే విపక్షంలోని లోకేశ్ చెబితే మేం వినాలా? అన్న ధోరణిలో సాగిన జగన్ ప్రభుత్వం లోకేశ్ సూచనలను పెడచెవిన పెట్టింది. అయినా నిరుత్సాహ పడని లోకేశ్… జగన్ కు పదే పదే లేఖలు రాస్తూ… విద్యార్థులు, వారి కుటుంబాలకు పొంచి ఉన్న ముప్పును చెబుతూ వచ్చారు. ఈ విషయంలో లోకేశ్ చూపిన పోరాట పటిమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతల్లోనూ కనిపించదన్న వాదన వినిపించింది. ఈ విషయంలో రాజీ లేని పోరాటం సాగించిన లోకశ్… చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహంతో జగన్ సర్కారు దిగొచ్చిన తర్వాత తన సలహా ఎంత విలువైందన్న విషయాన్ని లోకానికి చెప్పగలిగారు. జగన్ కు లేఖల మీద లేఖలు రాస్తున్న లోకేశ్ పై వైసీపీ కేడర్ తనదైన శైలి కామెంట్లు సంధించినా.. ఎక్కడా ఆవేశానికి గురి కాకుండా లోకేశ్ వ్యవహరించిన తీరు నిజంగానే అందరినీ ఆశ్చర్యంలో మెంచెత్తేలా చేసింది.
జగన్ మెడలు వంచేసి…
అటు పార్టీలో, ఇటు ప్రభుత్వ పాలనలో తనదైన శైలి పనితీరును కనబరచినా లోకేశ్ కు ఆశించిన మేర గుర్తింపు రాలేదనే చెప్పాలి. అయితే రోజుల తరబడి, ఏమాత్రం నిరత్సాహానికి గురి కాకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరేదాకా… తన పోరాటాన్ని ఆపకుండా సాగిన లోకేశ్… తన సత్తా ఏమిటో నిరూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సహనం కాకలు తీరిన రాజకీయ నేతల్లోనూ కనిపించదన్న విశ్లేషణలూ కొనసాగుతున్నాయి. మొత్తంగా ఒకే ఒక్క దెబ్బతో జగన్ మెడలు వంచేసిన లోకేశ్… టీడీపీకి ఇక భవిష్యత్తు లేదన్న వారి నోళ్లను మూయించారు. అంతిమంగా టీడీపీకి భావి అధినేతను తానేనని కూడా లోకేశ్ నిరూపించుకున్నారన్న విశ్లేషణలు ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.
బ్రాండ్ న్యూ లోకేశ్… ట్విట్టర్ మాట ఇది
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే లోకేశ్… ట్విట్టర్ లో అయితే తన ప్రత్యర్థులపై విమర్శలు సంధించే విషయంలో తనదైన శైలి స్పీడు చూపిస్తుంటారు. అదే సమయంలో వర్తమాన అంశాలపై ఇతరుల కంటే చాలా స్పీడుగా స్పందిస్తుంటారు. ఇలా తనదైన స్పీడు చూపించే లోకేశ్ పై ట్విట్టర్ ఏమన్నదన్న విషయానికి వస్తే… బ్రాండ్ న్యూ లోకేశ్… అంటూ ఆయనపై ఆ సంస్థ అమితాసక్తి రేకెత్తించే వ్యాఖ్య చేసింది. ఇటీవల ట్విట్టర్ స్పేసేస్ సెషన్ లో లోకేశ్ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ను పూర్తిగా స్టడీ చేసిన ట్విట్టర్ ఆయనను బ్రాండ్ న్యూ పొలిటీషియన్ గా అభివర్ణించింది. సాధారణ రాజకీయ నేతల్లో కనిపించే అసహనం గానీ, కోపం గానీ లోకేశ్ లో కనిపించలేదని, ప్రతి విషయం మీద స్పష్టమైన అవగాహనతో లోకేశ్ ఉన్నారని ట్విట్టర్ కుండబద్దలు కొట్టేసింది. అంతేకాకుండా అధికార పార్టీపై సాగించే పోరులో… మనం లేకుంటే ఇక ప్రజలకు దిక్కెవరు? అంటూ ఆయన తన పార్టీ కేడర్ కు సూచించిన వైనాన్ని ట్విట్టర్ ప్రధానంగా ప్రస్తావించింది.
Must Read ;- మరో ‘పరీక్ష’లో లోకేష్ సక్సెస్.. జగన్ ఫెయిల్











