అందం లక్షణమే ఆకర్షించడం .. అది ఎంతోమంది కవులను చేసింది .. మరెంతో మందిని శిల్పులను చేసింది. అలాంటి అందం ఇప్పుడు అభిమానులను చేస్తోంది .. ఆరాధకులను చేస్తోంది. అలా తన అందం అనే మంత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ భామగా ఊర్వశి రౌతేలా కనిపిస్తుంది. పేరుకు తగినట్టుగా నిజంగానే ఈ సుందరి ఊర్వశినే. దేవేంద్రుడి కళ్లుగప్పి ఆట విడుపుకోసం అమరలోకం నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తాను అడుగుపెట్టిన ప్రదేశాన్నే అమరలోకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఊర్వశి రౌతేలాను చూస్తే బార్బీ బొమ్మకు ప్రాణం పోసి బాలీవుడ్ కి తీసుకొచ్చినట్టు అనిపించడం ఖాయం. అంత అందంగా .. పొందికగా .. నాజూకుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు కాస్త తీరిక చేసుకుని ప్రబంధాలన్నీ చదివేసి, ఆ వర్ణనలన్నీ వంటబట్టించుకుని గీసిన చిత్రపటం మాదిరిగా ఉంటుంది. వన్నెలన్నీ తీర్చిదిద్ది మలచిన శృంగారదేవతలా ఉంటుంది. అందుకనే ‘వరల్డ్ టాప్ టెన్ సెక్సీ ఉమెన్’ జాబితాలో ఈ సుందరికి చోటు దక్కింది. ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి బ్యూటీగా నిలిచింది.

చేపల్లాంటి కళ్లు .. వెన్నపూసతో చేసినట్టుగా కనిపించే నాసిక .. పల్చని పెదాలు .. పనసతోన్న వంటి చిన్ని గెడ్డం .., పసుపు – పచ్చకర్పూరం కలిపి చేసినట్టుగా అనిపించే మోహన రూపం ఈ అమ్మాయికి ఈ ఘనతను తెచ్చిపెట్టి ఉంటుంది. ఊర్వశితో పాటు ఆమె అభిమానులకు కూడా ఇది ఆనందకరమైన వార్తనే. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ దానిమ్మ మొగ్గ, ఇకపై స్టార్ హీరోయిన్ గా బిజీ కావాలనే పట్టుదలతో ఉంది. అందాన్ని మించిన ఆయుధం లేదు గనుక, ఈ గోల్ ని చేరడం ఆమెకి పెద్ద కష్టం కాకపోవచ్చునేమో.
Must Read ;- సలార్ నుంచి స్టార్ డాటర్ బర్త్ డే పోస్టర్










