విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకొని మహా శివరాత్రి కానుకగా థియేటర్స్ లో విడుదలైన కామెడీ ఎంటర్ టైనర్ ‘జాతి రత్నాలు’.ఆత్రేయ ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి ప్రథాన కథానాయకుడుగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..
కథేంటి? :
జోగిపేట్ లో లేడీస్ ఎంపోరియమ్ ను రన్ చేస్తున్న శ్రీకాంత్ హైద్రాబాద్ లో మంచి ఉద్యోగం సంపాదించి .. లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటాడు. తనలాగే.. ఆ ఊళ్ళో పనీ పాటా లేకుండా తిరుగుతూ.. ఇంట్లో వారికి భారంగా మారిన అతడి స్నేహితులు శంకర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) లతో అతడు హైద్రాబాద్ కు పయనమవుతాడు. అక్కడో రిచెస్ట్ అపార్ట్ మెంట్ లో మకాం పెడతారు. పక్క ఫ్లాట్ లో ఉంటున్న చిట్టి (ఫరియా అబ్బుల్లా) తో శ్రీకాంత్ ప్రేమాయణం మొదలుపెడతాడు. ఇంతలో ఆ ముగ్గురూ.. లోకల్ యం.ఎల్.ఏ చాణ్యక (మురళీ శర్మ) మీద హత్యా ప్రయత్నం చేశారనే అభియోగంతో జైల్లో పడతారు. చివరికి వారు ఆ నేరం నుంచి ఎలా బైటపడతారు? అనేది మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
కామెడీనే ప్రధాన అస్త్రంగా చేసుకొని కథ రాసుకున్నప్పుడు ఒకోసారి లాజిక్కులు మిస్ అవుతుంటాయి. అయితే ఆ వీక్ నెస్ ను కవర్ చేసి, ప్రేక్షకుల్ని పూర్తిగా సినిమాలోకి లీనం చేయాలంటే మాత్రం.. హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. కొత్త దర్శకుడు అనుదీప్ కెవీ .. తన డెబ్యూ మూవీకి సరిగ్గా ఆ వ్యూహాన్నే అనుసరించాడు. అందులో అతడు దాదాపు గా సక్సెస్ అయ్యాడు. సినిమా బిగినింగ్ నుంచి వన్ లైన్ పంచులు పేలుస్తూ ముగ్గురు స్నేహితులూ చేసిన ఎంటర్ టైన్ మెంట్అంతా ఇంతా కాదు. అందులోనూ నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ .. హాస్యం పండించడంలో ఆరితేరిన వారు. ఆ ముగ్గురితోనూ టైటిల్ జెస్టిఫికెషన్ ఇవ్వడానికి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ బాగా కష్టపడ్డాడు దర్శకుడు.
ఫస్టాఫ్ వరుస పంచ్ లతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. కానీ సెకండాఫ్ కొచ్చేసరికి కొన్ని డ్రాగులు, ఫస్టాఫ్ రేంజ్ లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో యావరేజ్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతలోనే క్లైమాక్స్ లో మళ్ళీ సినిమా ఒక్కసారిగా లేస్తుంది. కామెడీ ఎండింగ్ తో ముగుస్తుంది.
ఇక శ్రీకాంత్ గా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అదుర్స్. చాలా నేచురల్ గా అతడు తన పాత్రను రక్తి కట్టించాడు. అలాగే.. అతడి సైడ్ కిక్స్ గా నటించిన రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కామెడీ తో సినిమాను నిలబెట్టారు. అలాగే.. వెన్నెల కిశోర్ కామెడీ మరింతగా మెప్పిస్తుంది. అతిథిపాత్రలో కీర్తి సురేశ్ మెరిసి మెప్పిస్తుంది. అది ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రైజ్. అలాగే.. ఒక షాట్ లో విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తాడు. జడ్జ్ గా బ్రహ్మానందం.. నవ్వులు పూయిస్తారు. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కి ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస ఆఫర్స్ లభిస్తాయనడంలో సందేహంలేదు. చక్కటి అభినయంతో మెప్పించింది. ఇక మురళీ శర్మ, బ్రహ్మాజీ, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, తణికెళ్ళ భరణి, జబర్దస్త్ మహేశ్ పాత్రలు కూడా జనాన్ని మెప్పిస్తాయి. ఇక సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమా టో గ్రఫీ కూడా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద చెప్పాలంటే.. జాతి రత్నాలు సినిమా ను ఒక సారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్టాఫ్ ఇచ్చిన కామెడీ కిక్.. సెకండాఫ్ లో తగ్గినా.. క్లైమాక్స్ లో ట్విస్ట్ కు సేటిస్ఫై అవుతారు. ఫైనల్ గా సినిమా చూసి నవ్వుకుంటూ బైటికి వస్తారు ప్రేక్షకులు.
హైలైట్ పాయింట్స్ : ముగ్గురి కామెడీ టైమింగ్, పంచులు, క్లైమాక్స్ ట్విస్ట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు
నటీనటులు : నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, గిరిబాబు, బ్రహ్మాజీ, శుభలేఖ సుధాకర్, తనికెళ్ళ భరణి, నరేశ్, వెన్నెల కిశోర్ తదితరులు.
సంగీతం : రథమ్
సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్
నిర్మాణం : స్వప్నా సినిమా
దర్శకత్వం : అనుదీప్ కేవీ
విడుదల తేదీ : మార్చ్ 11, 2021-03-11
ఒక్కమాటలో : నవ్వితే… జాతిరత్నాలు
రేటింగ్ : 3 /5
–ఆర్కే