రాజకీయాల్లో పాదయాత్రకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పడిపోయిన పార్టీ అధికారంలోకి రావాలన్నా.. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి తేవాలన్నా నాయకులకు కనిపించే మార్గం ఇదే. పాదయాత్రల ఆచారాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాపులర్ చేశారు. గతంలో ఎన్టీఆర్ రథయాత్ర నిర్వహించి ప్రజల్లో మంచి పలితాలు సాధించగా, ఆ తరువాత రాష్ట్రం మొత్తం పాదయత్ర నిర్వహించి ప్రజలకు అత్యంత చేరువయ్యారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చేసిన పాదయాత్ర ఓ సంచలనంగా మారింది. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో బలంగా ఉన్న టీడీపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. వైయస్ చనిపోయిన తరువాత వైయస్ జగన్ ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చారు.
అయినా పెద్దగా ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రమంతా సుదీర్ఘమైన పాదయాత్రతో రికార్డులు సృష్టించారు. విభజన తర్వాత.. నవీన ఆంధ్రప్రదేశ్ కు ఆ రకంగా ఆయన తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత గత ఎన్నికల ముందు జగన్ మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు.. ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఇదే కోవలో మరికొంత మంది నేతలు నడిచే అవకాశం కనిపిస్తోంది.
Must Read ;- సరికొత్త ప్రారంభానికి చంద్రబాబు దిశానిర్ధేశం
రాష్ట్రంలో రాజకీయం అస్తవ్యస్తం..
ఇక తెలంగాణలో కూడా పాదయాత్రల సంస్కృతి మొదలు కాబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నెమ్మదిగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ మెజారిటీతో గద్దెనెక్కిన ఆ పార్టీ ప్రజలను మోసం చేస్తోందంటూ .. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ అన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసాయి. బీజేపీ వేగంగా ప్రజల్లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రిపై ఎదురుదాడికి దిగుతూ ప్రజల్లో స్థానం సంపాదించుకుంటోంది. బీజేపీ దూకుడుకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు గ్రేటర్ లోనూ మంచి ఫలితాలు సాధించింది . దీంతో తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్న సంకేతాలిచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అధ్యక్ష పీఠం కోసం కుమ్ములాటలతోనే సరిపోతోంది. నాయకులు అధ్యక్ష పీటం సాధించడంలో బిజీగా మారిపోయారు. దీంతో బీజేపీకి ప్రజల్లోకి వెళ్ళేందుకు మరింత సమయం దొరికినట్టైంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగానే బండి సంజయ్ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగా అప్పుడు జరగలేదు. అంత వ్యవధిలేకుండాపోయింది. కానీ ఒకసారి ఆ ఆలోచన వచ్చిన తర్వాత.. మరో సందర్భానికి ముడిపెట్టి అయినా.. బండి సంజయ్ పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుందనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి.
Also Read ;- రాములమ్మ పోరాటమూ చంద్రబాబుపైనేనా..
పాదయాత్రకు సిద్దం అవుతున్న మరో నేత ..
ఎన్ని గొడవలు ఎలా ఉన్నా ప్రజల సమస్యలపై పోరుకు తాను సిద్ధమవుతానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నానని చెప్పుకుంటున్న జయప్రకాశ్ రెడ్డి తెలంగాణలో రైతు సమస్యలపై పోరుబాట పడతా నంటున్నారు. ఇందుకోసం సంగారెడ్డి నుండి అదిలాబాద్ వరకు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. పాదయాత్ర లో భాగంగా రాష్ట్రం మొత్తం చుట్టి వస్తానని చెబుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రిని నమ్మి రైతులు సన్నాలు పండిచారని ఇప్పుడు వాటిని కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగ్గారెడ్డి.
ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. రైతు సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకే తన పాదయాత్ర అని ఆయన చెబుతున్నారు. అయితే పాదయాత్ర ఎప్పటి నుండి ఉంటుంది.. రూట్ మ్యాప్ ఏమిటీ అన్నది త్వరలోనే ప్రకటిస్తా అంటున్నారు. మరి ప్రతి కార్యక్రమానికి అధిష్టానం అనుమతి తీసుకుంటారు.. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ కార్యక్రమాలు ఉంటాయి. మరి దీనికి అధిష్టానం అనుగ్రహం ఉంటుందా.. అనుమతి ఇవ్వక పోయినా ఆయన పాదయాత్ర చేస్తారా అన్నది చూడాలి.
Also Read ;- టీఆర్ఎస్ కథ తేల్చేందుకు ‘త్రీ పాయింట్ ఫైట్’