బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనా స్టైల్. సుశాంత్ మరణం దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వరకు ఆమె తనదైన శైలిలో స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా తన ఇంటిని కూల్చినా బెదరలేదు కంగనా. అలాంటి కంగనా రీసెంట్ గా మనాలి నుండి తన సోదరి రంగోలి చందేల్‌తో కలిసి ముంబయి చేరుకున్నారు.
ఈరోజు ఉదయం భారీ భద్రతా మధ్య తన సోదరితో కలిసి ముంబయిలో ఉన్న సిద్ది వినాయక్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు కంగనా. గణపతి నుండి ఆశీర్వాదం పొందటానికి ప్రఖ్యాత ఆలయానికి వెళ్ళడానికి సాంప్రదాయక రూపాన్ని ఎంచుకుంది కంగనా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో కంగనా తన సోదరి రంగోలితో కలిసి ఆలయం వైపు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె చుట్టూ సెక్యూరిటీ గార్డులు కూడా కనిపిస్తారు.
కంగనా బంగారు అంచుతో ఉన్న ఆకుపచ్చ పట్టు చీరను ధరించారు. అంతేకాకుండా ఆమె మెడలో ఒక అందమైన ఎరుపు, బంగారం రంగు కలగలిసిన హారం, ముక్కు పుడకను కూడా ధరించింది. తన జుట్టు ముడి వేసుకొని దానికి తెల్లని పూలను చుట్టారు. ఆమె మెడ పై భాగం నుండి మోకాళ్ళ వరకు శ్లోకాలతో ఉన్న వస్త్రాన్ని ధరించింది. ఆలయం లోపలికి అడుగు పెట్టేటప్పుడు కంగనా మరియు ఆమె అక్క కూడా తెల్లటి మాస్కులు వేసుకున్నారు. ఆమెను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ వెను తిరిగారు కంగనా. ప్రస్తుతం కంగనా ‘ధాకాడ్’ సినిమా కోసం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి నుండి షూటింగ్ సెట్స్ పై వెళ్లనున్నది.
Must Read ;- నీరెండలో తేనేటిని సేవిస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్