మూడు సంవత్సరాలుగా ఎదురుచూపులు చూస్తూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న పిఆర్‌సి రిపోర్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చిలకరించింది. దీంతో ఇంతకాలం ఎంతో ఓర్పుతో ఎదురుచూసిన ఉద్యోగులు ఒక్కసారిగా పి.ఆర్.సి. నివేదికను చూసి భగ్గుమన్నారు. తాము ఎదురుచూసిన ఫలితం దరిదాపుల్లో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు. కేసీఆర్ వ్యవహార సరళిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజా పరిణామాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయడం జరుగుతూ వస్తోంది. గడచిన ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచడం అనేది చాలాకాలంగా జరుగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమిస్తుంది. సాధారణంగా ఏకసభ్య కమిటీగా ఇది రూపొందుతుంది. సదరు ఏకసభ్య కమిటీ గడచిన ఐదేళ్ల కాలంలో సగటు ఉద్యోగి జీవన ప్రమాణాన్ని రకరకాలుగా గమనించి, ఆ ఉద్యోగికి పెరిగిన జీవన వ్యయాన్ని అంచనావేసి, ఏమేరకు ఆ ఉద్యోగికి వేతనం పెరిగితే అతని జీవన ప్రమాణం, ప్రయాణం సజావుగా, నిలకడగా సాగుతుంది అనేవిషయాన్ని అంచనావేసి ఆమేరకు వేతన పెంపును ప్రతిపాదించడం జరుగుతూ వస్తోంది. ఈనేపధ్యంలో ప్రత్యేక రాష్ట్రంగా రూపొందిన తెలంగాణలో అప్పటికే వేతన సవరణ కమిటీ సిఫారసు చేసిన వేతనంకన్నా కొత్త రాష్ట్రం వచ్చిన జోష్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యోగులకు అత్యధిక ఫిట్ మెంట్ ను ప్రతిపాదించారు. ఇది అప్పట్లో మంచి పి.ఆర్.సి గా చెప్పుకోవచ్చు.
Must Read ;- కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారా?
అప్పట్లో రాష్ట్రం కూడా దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే రాష్ట్రం ఏర్పడి, వేతన సవరణ జరిగి కూడా ఐదేళ్లు గడచిపోయాయి. తర్వాత కొత్తగా ఎన్నికలు, అలాగే కొత్తగా వేతన సవరణ చేయాల్సిన సమయం ఆసన్నమయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి భిన్నంగా కనిపించసాగింది. దీంతో ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వం పట్ల కాస్త కినుక కనిపించసాగింది. కొత్త రాష్ట్రం వస్తే ఎందరికో నిరుద్యోగులకు ఉద్యొోగాలు వస్తాయని, అన్ని ఉద్యోగాలు మనవారికే లభిస్తాయని ఇలాంటి ఎన్నో ఆశలను రేకెత్తించి, అధికారంలోకి వచ్చిన తెరాస అధినేత తర్వాత కొత్త కొలువుల విషయాన్ని విస్మరించారు. అలాగే ఉద్యోగుల విషయాన్ని కూడా విస్మరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటూ పలువురు దేవుళ్లు, దేవతలకు పెద్ద పెట్టున మొక్కులు మొక్కుకున్నారు. ఈ మొక్కులను తీర్చుకోవడంలోనే వేల కోట్లు ఖర్చుపెట్టేశారు. అయితే ఈ మొక్కులన్నీ కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసమేనా… లేక తాము అధికారంలోకి రావడంకోసమా… అనేది కూడా సగటు తెలంగాణ ప్రజలకు అనుమానం రావడం కద్దు. ఏది ఏమైనా… కొత్తలో ధనిక రాష్ట్రంగా వుంటూ వచ్చిన తెలంగాణ తర్వాత పేద రాష్ట్రంగా రూపు సంతరించుకోవడం మొదలుపెట్టింది.
ఈ నేపధ్యంలో గడవుకన్నా ముందుగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి, కేసీఆర్ ఎన్నికలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు కూడా పెద్ద ఎరనే వేశారు. అసలు వేతన సవరణ చేయడానికి నెలలు, సంవత్సరాలు అవసరం లేదని, కేవలం రెండే నెలల్లో వేతన సవరణ చేసి, ఉద్యోగులకు వేతనాలు పెంచేస్తానంటూ ఎన్నికల్లో వాగ్దానం చేశారు.
Also Read ;- కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!
కానీ తొలినాట ఉద్యోగులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చెప్పాలి. అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామంటూ అదికూడా 61 సంవత్సరాలకు పెంచేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇలా పలు వాగ్దానాలు చేశారు. కానీ వీటిలో ఏవీ నెరవేరిన దాఖలాలు కనిపించకపోవడంతో సహజంగానే అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు ఇద్దరూ కూడా తెరాస పట్ల విముఖత చూపించారు. ఉద్యోగులు పనిగట్టుకుని మరీ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకుని తమ వ్యతిరేకతను ఓటు ద్వారా తెలిపారు. దీంతో కినుక వహించిన కేసీఆర్ ఇక అప్పటినుండి తన ఆగ్రహాన్ని అణచుకుంటూ, ఉద్యోగుల పట్ల మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించనారంభించారు. రెండు నెలలకే పి.ఆర్.సి. నివేదికను అందివ్వమంటూ నియమించిన త్రిసభ్య కమిటీ మూడేళ్లయినా నివేదికను అందివ్వకపోవడం దీనికి నిదర్శనం.
అయితే ఉద్యోగులు కూడా ఏమీ భయపడలేదు. తమ వ్యతిరేకతను ఏదోరకంగా తెలుపుతూనే వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్ల ప్రభావం బాగానే పడిందని చెప్పవచ్చు. ఫలితంగా అప్పటి వరకూ కేవలం ఒక్క ఎమ్మెల్యే సంఖ్యతో ఉన్న బిజెపికి మరో సంఖ్య పెరిగింది. దీంతో తెరాస వర్గం ఆలోచనలో పడింది. ఇదేసమయంలో అటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా తెరాసను కలవరపెట్టాయి. దీంతో పాపం తెరాసకు మెట్టు దిగక తప్పలేదు. అయితే అప్పటికే రకరకాల పథకాల నిర్వహణ నేపధ్యంలో ఖజానా ఖాళీ అయింది. దీంతో ఇప్పుడు వేతన సవరణ జరిగితే పెరిగే భారాన్ని భరించడానికి తెలంగాణ ఖజానా సిద్ధంగా లేదు. మరోవైపు నాగార్జున సాగర్ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి మరోసారి తెరపైకి పి.ఆర్.సి. ని తీసుకువచ్చారు.
Also Read ;- కేసీఆర్‌కి నిరుద్యోగుల పరీక్ష.. పదవీ విరమణ వయస్సు పెంపుపై మల్లగుల్లాలు
కొత్త సంవత్సరం 2వ తేదీన ఉద్యోగులకు తీపి కబురు అంటూ పత్రికాముఖంగా ప్రకటనలు గుప్పించారు. దీంతో పత్రికలు కూడా ఈ విషయాన్ని పెద్ద పెట్టున ప్రచారం చేశాయి.
ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్న సామెత చందంగా అసలు పి.ఆర్.సి. నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించనేలేదు… కానీ అప్పుడే ఉద్యోగులకు తీపి కబురు అంటూ ప్రకటనలు. దీంతో సాధారణ ప్రజలు ఉద్యోగులకు జీతాలు పెరిగేశాయే…! అనుకోనారంభించారు. కానీ ఇప్పటిదాకా దాని అంతూ పొంతూ లేదు. చివరికి ఉద్యోగులు ధర్నాలు చేశారుకూడా. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి కదలిక కనిపించలేదు. చివరికి కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని బహిరంగ పరచడానికి మరో పదిహేను రోజులు. ఇలా దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన వేతన సవరణ కమిటీ నివేదిక ఎట్టకేలకు బహిర్గమయింది. అయితే ఈ నివేదిక ఉద్యోగుల జీతాలను పెంచి, వారి జీవితాలను సంతోషమయం చేసేదిగా కనిపించకపోగా… ఇప్పటికే ఉన్న జీతాలను తగ్గించి, వారి జీవితాలను అగమ్యగోచరంగా తయారుచేసేదిగా ఉంది.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 27 శాతం ఐ.ఆర్. ఇచ్చి ఉద్యోగులు ఆనందంగా తమ ఉద్యోగాలను చేసుకుంటున్నారు. దీంతో పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంత ఇచ్చినపుడు ధనిక రాష్ట్రమైన తమ తెలంగాణలో మరింత పెరుగుదల ఉంటుందని ఇంతకాలంగా ఉద్యోగులు ఉవ్విళ్లూరుతూ వచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించనంత తక్కువ ఫిట్మెంట్ ను ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను సమర్పించింది. దీంతో జీతం పెరిగినాకూడా ఇప్పటికే కరోనా కారణంగా భారీగా పెరిగిన ధరల వల్ల అతలాకుతలం అవుతున్న సగటు ఉద్యోగి జీవితం ఈ వేతన పెంపువల్ల ఎలాంటి లాభం కలుగకపోగా… వేతనం మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా ఉంది.
ఎందుకంటే ఈ నివేదికలో ఉద్యోగులకు ఇస్తూన్న హెచ్.ఆర్.ఎ. ను తగ్గించాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది. దీంతో ఉద్యోగులకు వచ్చే వేతనంలో కోత విధించక తప్పదు. పెరిగిన జీతంలో సగభాగం తరుగుడుకే సరిపోతుంది. ఇక పెరిగినా పెరగకపోయినా పెద్ద తేడా కనిపించదు. దీంతో ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- కేసీఆర్‌కూ.. PK సహాయం కావాల్సిందేనా..!
మరోవైపు ఉద్యోగులను చాకచక్యంగా తనవైపుకు తిప్పుకోవడానికి అపర చాణుక్యుడైన కేసీఆర్ ముందస్తు చర్యగా కమిటీని తక్కువ వేతన పెంపును సిఫారసు చేయమని సూచించి, తర్వాత తాను ఎంతో ఉదార స్వభావుడిని అని ఉద్యోగులు పొగడుతూ, పాలాభిషేకాలు చేయడానికి సిద్ధపడేలా వేతన పెంపును సూచించినా ఆశ్చరపోవాల్సిన పనిలేదు. లేదా ఖజానాలో నిధుల లేమిని గురించి కమిటీకి సూచించి, ఆమేరకు వేతన పెంపును సిఫారసు చేయాల్సిందిగా కమిటీకి ముందుగానే సూచనలు చేసివుండవచ్చని పలువురు ఉద్యోగులు భావిస్తున్నారు. ఏదిఏమైనా వేతన సవరణ సంఘం సూచించిన వేతన పెంపు నిజంగా ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు.
మరోవైపు ఉద్యోగులకు పెన్షన్ ను లేకుండా చేసి, కేవలం కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం ప్రవేశపెట్టి, ఉద్యోగుల వేతనంలో కొంతమేర మినహాయించి, ఉద్యోగి పదవీ విరమణ అనంతరం దాన్ని ఉద్యోగికి అందజేయడం అనే పద్ధతిని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఉద్యోగి వేతనంలో పదిశాతం మేరఉంటూ వస్తోంది. తాజాగా వేతన సవరణ కమిటీ సిఫారసులో ఇది 14 శాతం మేర ఉండాలంటూ సూచించడంతో సి.పి.ఎస్. ఉద్యోగులు విస్తుపోతున్నారు. తమకు వేతనం పెరిగినా కూడా అసలు పెరుగుదల కూడా కనిపించదంటూ వాపోతున్నారు.
ఈ నివేదికలో మరో చిత్రం ఏమిటంటే… గత రెండు సంవత్సరాల కాలంటో సగటు తెలంగాణ ఉద్యోగి జీవన వ్యయం భారీగా తగ్గిందంటూ కొన్ని నివేదికలు సూచించడం గమనార్హం. ఇలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వేతన సవరణ కమిటీ వేతన పెంపును సిఫారసు చేసివుంటే అది పూర్తిగా తప్పు అనే చెప్పాలి. గత ఏడాది కాలంలా కరోనా మహమ్మారి కారణంగా సాధారణ ఉద్యోగి స్థాయి నుండి పెద్దస్థాయి ఉద్యోగుల వరకు జీవన వ్యయం పెరిగింది అని చెప్పక తప్పదు. సరకుల రవాణా నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు బాగానే పెరిగాయి. దీనికితోడు వేతనంలో కోత విధించడంతో ఉద్యోగి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఫలితంగా అతని జీవన వ్యయాన్ని మరింతగా తగ్గించుకుంటూ వచ్చాడు. దీని ఫలితంగానే సగటు ఉద్యోగి జీవన వ్యయం తగ్గిందని చెప్పవచ్చు. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని వేతన సవరణ కమిటీ వేతన సవరణను సిఫారసు చేసివుంటే అది అర్థరహితం అని చెప్పవచ్చు. మరోవైపు ఉద్యోగుల పిల్లల చదువులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం ఫీజు రీయింబర్స్మెంట్ ను కూడా రద్దు చేస్తే బాగుంటుందంటూ కమిటీ నివేదిక ఇవ్వడం మరింత హాస్యాస్మదంగా కనిపిస్తోంది. మొత్తానికి వేతన సవరణ కమిటీ నివేదిక ఉద్యోగికి ఆనందాన్ని కలిగించాల్సింది పోయి ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి భారాన్ని కలిగించాల్సిన నివేదిక ఖర్చును తగ్గించేదిగా కనిపిస్తోంది. ఏదిఏమైనా వేతన సవరణ కమిటీ సూచించిన వేతన పెంపు మాత్రం ఉద్యోగులకు నీరసాన్ని కలిగించిందనే చెప్పవచ్చు!!
Also Read ;- ‘కేసీఆర్ ఏక పక్ష ధోరణి’.. ఎండగట్టేందుకు కోదండరాం దీక్ష











