నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అనేక వెబ్ సిరీస్ లు భారీ రేటింగ్స్ తో విజయం సాధించాయి. విజయాలు మాట పక్కన పెడితే నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన అనేక వెబ్ సిరీస్ లు పలు వివాదాలలో చిక్కుకున్నాయి. ఇప్పుడు తాజాగా `ఏ సూటబుల్ బాయ్` అనే వెబ్ సిరీస్ కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్ లో ఒక ప్రేమ జంట గుడిలో ముద్దులు పెట్టుకున్న సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలపై అభ్యంతరం తెలియజేశారు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ. ఇది ముమ్మాటికీ హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సంబంధించిన ఇద్దరు ప్రతినిధులపై ఆయన ఫిర్యాదు చేశారు. గౌరవ్ తివారీ ఇచ్చిన ఫిర్యాదుతో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఉపాధ్యక్షుడు మోనికా షెర్గిల్ అలాగే నెట్‌ఫ్లిక్స్ పబ్లిక్ పాలసీల డైరెక్టర్ అంబికా ఖురానాపై మధ్యప్రదేశ్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. దీనిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ ఇచ్చిన ఫిర్యాదుతో నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఇప్పటికే అందుకు సంబంధించిన దర్యాప్తును మొదలపెట్టామని తెలిపారు.
ఇక గౌరవ్ తివారీ మాట్లాడుతూ నర్మదా నది ఓడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం మహేశ్వర్ ఆలయం లోపల ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. ఇది ముమ్మాటికీ హిందూ మత మనోభావాలు దెబ్బతీసే చర్యని ఆయన అన్నారు. ఇది ఒక దుర్మార్గపు చర్య అని ఆలయంలో ముద్దుల సన్నివేశం లవ్ జిహాద్ ను కూడా ప్రోత్సహిస్తోంది అని ఆయన అన్నారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే ఇటువంటి సన్నివేశాలను తొలిగించాలని గౌరవ్ తివారీ తెలిపారు. మరి ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Must Read ;- బాలయ్య సరసన మల్లూ కుట్టి